మర్డర్ మిస్టరీని చేధించిన OLA డ్రైవర్
Uttar Pradesh: ఆస్తి కోసం ఓ ఆడపిల్లని చంపేసి ఎవ్వరికీ తెలీకుండా మృతదేహాన్ని ఓ సంచిలో పెట్టుకుని ఎక్కడైనా పారేసి తప్పించుకుందాం అనుకున్నారు. కానీ దేవుడనే వాడు ఒకడు ఉన్నాడుగా. అన్నీ పై నుంచి చూస్తుంటాడుగా. ఓలా (ola) క్యాబ్ డ్రైవర్ రూపంలో వచ్చి మరీ హంతకులను పోలీసులకు పట్టించాడు. అసలు ఏం జరిగిందంటే.. ఉత్తర్ ప్రదేశ్‌లోని (uttar pradesh) కాన్పూర్‌కు చెందిన సౌరభ్ అనే వ్యక్తికి తన బంధువైన కుసుంతో కొంతకాలంగా ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. దాదాపు రూ.40 కోట్ల విలువైన ఆస్తిలో ఎక్కడ కుసుంకు వాటా ఇవ్వాల్సి వస్తుందోనని ఆమెను ఎలాగైనా చంపేయాలని అనుకున్నాడు.
ప్లాన్ ప్రకారం జులై 11న తన స్నేహితుడి సాయంతో సౌరభ్.. నోయిడాలో ఉంటున్న కుసుం ఇంటికి వెళ్లాడు. ఎవ్వరూ లేని సమయం చూసి కత్తితో పొడిచి చంపేసాడు. అనుమానం రాకుండా బాడీని ఎక్కడైనా దూర ప్రాంతంలో పడేసి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం నోయిడా నుంచి మహరాజ్‌పూర్ ప్రాంతానికి సౌరభ్ ఓలా (ola) క్యాబ్ బుక్ చేసుకున్నాడు. తన చెల్లెలు అనారోగ్యంతో చనిపోయిందని ఆమె శవాన్ని క్యాబ్‌లో ఎక్కించాలని అన్నాడు. ఇందుకు క్యాబ్ డ్రైవర్ మనోజ్ అస్సలు ఒప్పుకోలేదు. అదీకాకుండా రక్తపు మరకలు చూసి మనోజ్‌కి అనుమానం వచ్చింది. దాంతో మనోజ్ వారిని ఎక్కించుకోకుండానే నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. జరిగినదంతా చెప్పాడు. వెంటనే పోలీసులు విచారణ ప్రారంభించారు. కుసుం మృతదేహం ఫతేపూర్ ప్రాంతంలో దొరికింది. పోలీసులు వెంటనే సౌరభ్‌ను అతనికి సాయం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.