ఎలుకపై ఆరోపణ.. ఉద్యోగిపై వేటు
Hole on Road: ఓ కంపెనీ చక్కగా రోడ్డు వేసింది. కొన్ని నెలల్లోనే దానిపై పెద్ద గుంత ఏర్పడింది. దాంతో ప్రభుత్వ అధికారులు ఆ రోడ్డు వేసే సమయంలో ఉన్న జూనియర్ ఉద్యోగిని పిలిపించి కొత్తగా వేసిన రోడ్డుపై గుంత ఎలా ఏర్పడింది అని అడిగారు. దీనికి ఆ ఉద్యోగి చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? ఎలుకల వల్ల ఆ గుంత ఏర్పడింది అని. దాంతో ఆ అధికారులకు ఒళ్లుమండిపోయింది. మరీ అంత ఎదవలా కనిపిస్తున్నామా అంటూ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసారు. దాంతో కంపెనీ డైరెక్టర్ రంగంలోకి దిగాడు. వాటర్ లీకేజ్ వల్ల ఆ గుంత ఏర్పడిందని.. తలా తోకా లేని సమాధానం చెప్పినందుకు ఆ జూనియర్ ఉద్యోగిని పీకేసామని చెప్పారు. ఆ గుంతను పూడ్చే బాధ్యత తమదే అని చెప్పి ఒప్పించారు.
రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ కొన్ని కిలోమీటర్ల మేర కొత్త రోడ్డు వేసారు. ఈ కాంట్రాక్ట్‌ను KCC బిల్డ్‌కాన్ అనే కంపెనీ తీసుకుంది. రోడ్డుపై ఏర్పడిన గుంత గురించి స్థానికులు ఫిర్యాదు చేయగా వెంటనే అధికారులు పరిశీలించేందుకు వెళ్లారు. రోడ్డును నిర్మించిన KCC బిల్డ్‌కాన్ కంపెనీలో జూనియర్ ఉద్యోగి తనకు అన్నీ తెలిసినట్లుగా వెళ్లాడు. పైగా ఢిల్లీ ముంబై ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్ట్‌లో తాను భాగంగా ఉన్నానని.. కంపెనీలో తాను మెయింటైనెన్స్ మేనేజర్‌గా చేస్తున్నానని అధికారులను నమ్మించాడు. ఇక్కడి వరకు బాగానే మేనేజ్ చేసాడు కానీ.. అంత నాలెడ్జ్ ఉన్న మేనేజర్ ఎలుకల వల్ల రోడ్డుపై గుంత పడింది అనడంతో అధికారులకు అనుమానం వచ్చి కంపెనీకి లేఖ రాసారు. దాంతో అతని బాగోతం బయటపడింది. అత్యుత్సాహం ప్రదర్శించి ఉద్యోగం పోగొట్టుకున్నాడు.