AI: ఇక‌ ఆ అబ‌ద్ధం చెప్పి ఆఫీస్ ఎగ్గొట్ట‌లేరు..!

Hyderabad: కొన్నిసార్లు ఆఫీస్‌కు వెళ్లాల‌ని లేక ఏవో చిన్న చిన్న అబ‌ద్ధాలు చెప్పి డుమ్మా కొట్టేస్తుంటారు. ఇక ఆ ఛాన్స్ అస‌లు లేదండోయ్. ఎందుకంటే.. ఆర్టిఫిషియ‌ల్ ఇన్‌టెలిజెన్స్(AI) అబ‌ద్ధం చెప్పి డుమ్మా కొడుతున్నార‌ని తెలిస్తే వెంట‌నే మేనేజ్‌మెంట్‌కు చెప్పేస్తుంద‌ట‌. అదెలాగంటే.. ఉదాహ‌ర‌ణ‌కు మీకు ఆఫీస్‌కు వెళ్లాల‌ని లేద‌నుకోండి.. మీ మేనేజ‌ర్ లేదా బాస్‌కు ఫోన్ చేసి ఒంట్లో బాలేద‌ని సాకు చెప్పారనుకోండి.. ఏఐ(AI) మీ గొంతును బ‌ట్టి అది నిజ‌మో కాదో చెప్పేస్తుంద‌ట‌.

గుజ‌రాత్‌లోని(Gujarat) సూరత్‌కు(surat) చెందిన స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ ఇన్‌స్టిట్యూట్‌లోని(sardar vallabhbhai patel institute) రీసెర్చ‌ర్లు ఈ టెక్నాల‌జీని(technology) త‌యారుచేస్తున్నారు. ప్ర‌స్తుతానికైతే జ‌లుబు చేసింది అని లీవ్ పెట్టే ఉద్యోగుల‌పై ఈ టెక్నాల‌జీని ఉప‌యోగించ‌నున్నారు. జ‌లుబు కార‌ణంగా గొంతుమారిన‌ట్లు ఉంటుంది కాబ‌ట్టి.. ఉద్యోగి లీవ్ అడిగే స‌మ‌యంలో మాట‌ల్ని బ‌ట్టి అది నిజ‌మో కాదో చెప్పేస్తుంద‌ట‌. టెస్టింగ్‌లో భాగంగా దీనిని 630 మందిపై ఉప‌యోగించారు. వారిలో 111 మందికి జ‌లుబు చేసిన‌ట్లు ఏఐ(AI) క‌నిపెట్టింది.

ఏఐ(AI) వాయిస్ ఎనాలిసిస్(voice analysis) ఇప్ప‌టికే వాడ‌కంలో ఉన్న‌ప్ప‌టికీ ప‌టేల్ ఇన్‌స్టిట్యూట్ రీసెర్చ‌ర్లు కాస్త కొత్త‌గా ఈ టూల్‌ను డిజైన్ చేసారు. మాట‌ల్లోని టోన్‌ని బ‌ట్టి ఏఐ ప‌నిచేస్తుంద‌ని అంటున్నారు. ఇది కానీ స‌క్సెస్ అయితే.. ఐటీ కంపెనీల్లో ఈ టూల్‌ను ఇన్‌స్టాల్ చేస్తారు. అప్పుడు ద‌గ్గు, జ‌లుబు లేన‌ప్పుడు కూడా ఆ సాకులు చెప్పి లీవ్ అడిగితే మాత్రం ఏఐ ప‌సిగ‌ట్టేస్తుంది. అంతేకాదు.. సామాన్యులు కూడా ఈ టూల్‌ను మొబైల్ డివైజుల్లో ఇన్‌స్టాల్ చేసుకోవ‌చ్చు. దీని ద్వారా మ‌న‌కు ఒంట్లో న‌ల‌త‌గా అనిపిస్తే ద‌గ్గు, జ‌లుబు ఉన్నాయో లేదో ఏఐ చెప్పేస్తుంది. అప్పుడు వెంట‌నే వైద్యుల‌ను సంప్ర‌దించే అవ‌కాశం ఉంటుంది.