Section 420: 164 ఏళ్ల చ‌రిత్ర క‌లిగిన సెక్ష‌న్ 420 ఇక లేదు..!

section 420

Section 420: ఎవ‌రినైనా తిట్టాలంటే స‌ర‌దాగా వాడో 420 గాడు రా అని అంటుంటారు. 420 అనే ప‌దం మ‌న దైనందిన జీవితంలో ఓ భాగం అయిపోయింది. 420 పేరుతో ఎన్నో సినిమాలు కూడా వ‌చ్చాయి. మోసం, కుట్ర‌కు సంబంధించిన కేసులను సెక్ష‌న్ 420 కింద న‌మోదు చేస్తారు. అయితే ఈరోజు నుంచి సెక్ష‌న్ 420 అనే ప‌దం విన‌ప‌డ‌దు. ఎందుకంటే ఈరోజు నుంచి కొత్త నేర‌, న్యాయ చ‌ట్టాలు అమ‌ల్లోకి వ‌చ్చాయి. దాంతో ఇండియ‌న్ పీన‌ల్ కోడ్ (IPC) ఇక అమ‌ల్లోకి రాదు. దాని బ‌దులు భార‌తీయ న్యాయ స‌న్హిత (BNS) అమ‌ల్లో ఉంటుంది.

అయితే మ‌న న్యాయ చ‌ట్టాల్లో సెక్ష‌న్ 420 అనేది విప‌రీతంగా విన‌ప‌డుతూ ఉంటుంది. 60 శాతం కంటే ఎక్కువ కేసులు ఈ సెక్ష‌న్ కిందే న‌మోదవుతుంటాయి. ఈ సెక్ష‌న్ 420 ఇప్ప‌టిది కాదు. దీనికి 164 ఏళ్ల చ‌రిత్ర ఉంది. 1860లో మ‌న‌ల్ని బ్రిటిష‌ర్లు పాలిస్తున్న స‌మ‌యంలో చీటింగ్ కేసుల‌ను డీల్ చేసేందుకు ఈ సెక్ష‌న్ 420ని అమ‌లు చేసారు. ఈరోజు నుంచి 420 ఇక విన‌ప‌డ‌దు కాబ‌ట్టి.. చాలా మంది దీనిపై జోక్స్ పేలుస్తున్నారు. ఇక 420 అని దొంగ‌నాకొడుకుల‌ను పిల‌వలేమ‌ని స‌రదాగా కామెంట్స్ పెడుతున్నారు.

ప్ర‌ముఖ సీనియ‌ర్ లాయ‌ర్, ఎంపీ మ‌హేష్ జ‌ఠ్మ‌లానీ కూడా 420 ఇక అమ‌ల్లో ఉండ‌క‌పోవ‌డం ప‌ట్ల స్పందించారు. 420 సెక్ష‌న్ అనేది భార‌త‌దేశంలో చెర‌గ‌ని ముద్ర వేసుకుంద‌ని అన్నారు. మ‌రి సెక్ష‌న్ 420 లేదు కాబ‌ట్టి ఆ స్థానంలో ఏం వ‌ర్తిస్తుందో తెలుసా? సెక్ష‌న్ 318. ఇక నుంచి చీటింగ్ ఫ్రాడ్ కేసుల‌న్నీ ఈ సెక్ష‌న్ కిందే న‌మోద‌వుతాయి.