New York: కుంగుతున్న న్యూయార్క్ నగరం..!
New York: అమెరికాలోనే (america) అత్యంత పెద్ద నగరమైన న్యూయార్క్ (new york) కుంగిపోతోందట. ఇందుకు కారణం నగరంలో ఎక్కువైపోయిన స్కై స్క్రాపర్ల కట్టడాలే. 2021 నాటిని న్యూయార్క్ జనాభా 84.7 లక్షలు. జనాభాకు మించి ఎత్తైన బిల్డింగులు కట్టడంతో న్యూయార్క్ (new york) నగరం రిస్క్‌లో పడింది. సాటిలైట్ డేటా ఆధారంగా ప్రతి సంవత్సరం న్యూయార్క్ 1 నుంచి 2 మిల్లీమీటర్లు కుంగుతోంది. ఐస్ ఏజ్ తర్వాత భారీగా న్యూయార్క్ నేలపై ఎత్తైన భవనాలు రావడం, గ్రౌండ్ వాటర్ ఉపయోగం ఎక్కువ అయిపోవడం కూడా ప్రధాన కారణాలుగా చెప్తున్నారు నిపుణులు. నేల కుంగితే సముద్ర మట్టాలు పెరుగుతాయి.
దాని వల్ల భయంకరమైన తుఫానులు సంభవిస్తాయి. అమెరికాలో ఉన్న సముద్ర తీర అర్బన్ నగరాల్లో న్యూయార్క్ మాత్రమే కుంగిపోతుండడం గమనార్హం. న్యూయార్క్‌లో మొత్తం 1,084,954 బిల్డింగులు ఉన్నాయి. వీటి అన్నిటి బరువు 1.68 ట్రిలియన్ పౌండ్స్. అంటే.. ప్రపంచ జనాభా బరువుకి రెట్టింపు. బిల్డింగుల కింద ఉన్న నేల సామర్ధ్యాన్ని బట్టి సంవత్సరానికి నేల 2 మిల్లీమీటర్లు కానీ లేదా రెండు అడుగులు కానీ కుంగుతుంది. ఇప్పటికైతే భయపడాల్సిన అవసరం లేదు. కానీ ముందు ముందు న్యూయార్క్ నగరాన్ని విపరీతమైన వరదలు ముంచెత్తుతాయని భూగోళ శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు.
1880 నుంచి 2023 వరకు న్యూయార్క్ పరిసరాల్లో ఉన్న సముద్ర మట్టాలు 8 నుంచి 9 అంగుళాలు పెరిగాయి. 2023 నుంచి మరో 30 ఏళ్లలో ఈ సముద్ర మట్టాలు 30 అంగుళాలు పెరిగే అవకాశం ఉంది. వాతావరణ మార్పుల కారణంగా ప్రతి సంవత్సరం వడగాల్పులకు దాదాపు 350 మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడే అమెరికన్ ప్రభుత్వం అప్రమత్తమై న్యూయార్క్ నగరాన్ని కాపాడుకోవడానికి తక్షిణ చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.