జపాన్‌లో వ్యాపిస్తున్న ప్రాణాంతక వ్యాధి.. సోకిన రెండు రోజుల్లో మరణం
Japan: జపాన్‌లో ప్రాణాంతక వ్యాధి ప్రబలుతోంది. దీనిని స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ (STSS) అని పిలుస్తున్నారు. స్ట్రెప్టోకోకస్ అనే ప్రాణాంతకమైన బ్యాక్టీరియా కారణంగా ఈ వ్యాధి వస్తోందట. ముందు గొంతు నొప్పితో ఈ వ్యాధి మొదలవుతుంది. ఈ బ్యాక్టీరియా సోకిన రెండు రోజుల్లోనే ప్రాణాలు పోతున్నాయని జపాన్ వెల్లడిస్తోంది. దాంతో ఇతర దేశాలు అప్రమత్తమయ్యాయి. జూన్ 2 నాటికి జపాన్‌లో మొత్తం 977 కేసులు నమోదవగా.. గతేడాది 941 కేసులు నమోదయ్యాయి.
కీళ్లల్లో వాపు, జ్వరం, రక్తపోటు పడిపోవడం, ఊపిరి పీల్చుకోవడంలో సమస్యలు, అవయవాలు విఫలమవడం, కణాలు చచ్చిపోవడం వంటివి లక్షణాలుగా గుర్తించారు. లక్షణాలు మొదలైన 48 గంటల్లోనే ప్రాణాలు తీసేస్తోందట. 50 ఏళ్లు పైబడిన వారికి రిస్క్ ఎక్కువ అని చెప్తున్నారు. వ్యాధి సోకిన వారికి ప్రాణాలు పోయే అవకాశం 30 శాతం వరకు ఉంది. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవడం.. దెబ్బలు తగిలితే వెంటనే కట్లు కట్టుకోవడం వంటివి చేస్తుండాలట. ఈ బ్యాక్టీరియా పేగుల్లో చేరే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు.