ప్రభుత్వ అధికారి కొడుకు నిర్వాకం.. ప్రేయసి పై నుంచి కారు పోనిచ్చి…
Mumbai: ప్రియురాలితో గొడవ పడి అర్థరాత్రి సమయంలో ఆడపిల్ల అని కూడా చూడకుండా ఆమె కాలుపై నుంచి కారు పోనిచ్చాడు ఓ ప్రభుత్వ అధికారి కొడుకు. తన తండ్రి మంచి స్థాయిలో ఉన్నాడు ఎవ్వరూ ఏమీ చేయలేరన్న పొగరుతో ఆ వ్యక్తి ఇలా అమానవీయంగా ప్రవర్తించాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా వారు అసలు పట్టించుకోలేదంట. ఈ దారుణ ఘటన ముంబైలో చోటుచేసుకుంది.
మహారాష్ట్రలోని థానేకు చెందిన ప్రియా సింగ్.. ఇదే ప్రాంతానికి చెందిన అశ్వజిత్ గైక్వాడ్ ప్రేమించుకుంటున్నారు. అనిల్ మహారాష్ట్ర స్టేట్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ గైక్వాడ్ కుమారుడు. ప్రియ తెలిపిన వివరాల ప్రకారం.. గత సోమవారం ఉదయం తనకు అశ్వజిత్కు ఫోన్ వచ్చింది. తన ఇంట్లో ఫంక్షన్‌కు రావాలని కోరాడు. సరే అని ప్రియ అశ్వజిత్ ఇంటికి వెళ్లింది. అయితే ప్రియ ఉండగానే అశ్వజిత్ తన స్నేహితులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడట. అది గమనించిన ప్రియ పక్కకు రా మాట్లాడాలి అని పిలిచింది.
కానీ అశ్వజిత్ తన స్నేహితులతో కలిసి ప్రియ దగ్గరికి వెళ్లి అసభ్యకరంగా మాట్లాడాడు. దాంతో ప్రియకు ఒళ్లుమండి తిట్టేసింది. దాంతో అశ్వజిత్ తన ఫ్రెండ్స్ ముందే నడిరోడ్డుపై ప్రియను దారుణంగా కొట్టి గొంతు నులమాలని చూసాడు. ఆ గొడవ అంతటితో ఆగలేదట. ప్రియ కింద పడిన తన ఫోన్ తీసుకుంటుండగా అశ్వజిత్ తన కారు డ్రైవర్‌తో చెప్పి ప్రియ కాలు మీద నుంచి పోనిచ్చాడు.
దాంతో ప్రియ కాలు తీవ్రంగా గాయపడింది. ఒళ్లంతా గాయాలతో సాయం కోసం దాదాపు అరగంట సేపు ఎదురుచూసింది. రోడ్డుపై వెళ్తున్న కొందరు ప్రియను చూసి వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం కోలుకుంటున్న ప్రియ పూర్తిగా కోలుకోవడానికి ఆరు నెలల సమయం పడుతుందట. ఈ వివరాలన్నీ ప్రియ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కూడా తనకు సాయం చేయలేదని వాపోయింది. విషయం వైరల్ అవడంతో ముంబై పోలీసులు విచారణ చేపట్టేందుకు ముందుకొచ్చారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి అరెస్ట్ చేయలేదని పేర్కొన్నారు.