MQ-9B: చెన్నైలో కూలిన 1200 కోట్ల విలువైన డ్రోన్
MQ-9B: భారత నౌకాదళానికి చెందిన 1200 కోట్ల విలువైన MQ-9B డ్రోన్ చెన్నైలో కూలిపోయింది. దీనిని సముద్ర రక్షకుడిగా పిలుస్తారు. అమెరికాలో అత్యంత ఆధునికమైన టెక్నాలజీతో తయారైన ఈ డ్రోన్ మార్గ మధ్యలో సాంకేతిక లోపం తలెత్తడంతో చెన్నైలో కూలిపోయింది. నిన్న చెన్నైలోని INS రజళి అనే నౌకాదళ కేంద్రం నుంచి రెగ్యులర్ పర్యవేక్షణ నిమిత్తం బయలుదేరిన ఈ డ్రోన్ మార్గ మధ్యలో సాంకేతిక లోపం తలెత్తి కుప్పకూలిపోయింది.
ఈ డ్రోన్ కోసం భారత్ అమెరికాకు 1200 కోట్లు సమర్పించుకుంది. 40 వేల అడుగుల ఎత్తులో 30 గంటల పాటు గాలిలో ఉండగలిగే ఈ డ్రోన్ కూలిపోవడం అనేది భారత నౌకాదళానికి భారీ నష్టమనే చెప్పాలి. గాలిలో మార్గ మధ్యలో ఉండగా దీనిని రిపేర్ చేయడం కుదరకపోవడంతో అధికారులు కంట్రోల్డ్ క్రాష్‌కు పాల్పడ్డారు. కంట్రోల్డ్ క్రాష్ అంటే అధికారుల పర్యవేక్షణలో క్రాష్ ల్యాండింగ్ అవ్వడం. దీనిని తయారుచేసిన జనరల్ అటోమిక్స్ కంపెనీ నుంచి వివరణాత్మకమైన రిపోర్ట్ కావాలని అధికారులు కోరారు. ఇప్పుడంటే సమస్య వల్ల క్రాష్ ల్యాండ్ అయ్యింది కానీ పనిచేసినంత కాలం స్ట్రాంగ్‌గా ఉందని అధికారులు చెప్తున్నారు.
పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు వేలాది గంటల పాటు గాల్లో ప్రయాణించిందని అన్నారు. ఈ MQ-9B డ్రోన్ బాంబును, మిస్సైల్స్, ఆధునిక సర్వైలెన్స్ సామాగ్రి మోస్తుంది. దీనిని పరిశోధనలు, రక్షణ, విపత్తు సహాయ కార్యక్రమాలు, యాంటీ-సబ్‌మెరైన్ యుద్ధం, సమాచారం సేకరణ వంటి వివిధ లక్ష్యాల కోసం కూడా ఉపయోగించేవారు.