Aadhaar వ్య‌వ‌స్థ‌పై మూడీస్ షాకింగ్ ఆరోప‌ణ‌లు

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ఆధార్ కార్డు (aadhaar) వ్య‌వ‌స్థ‌పై గ్లోబ‌ల్ క్రెడిట్ ఏజెన్సీ మూడీస్ (moodys) షాకింగ్ ఆరోప‌ణ‌లు చేసింది. ఈ ఆధార్ కార్డు సిస్ట‌మ్ వేడి ఎక్కువ‌గా ఉండే ప్ర‌దేశాల్లో ప‌నిచేయ‌డం లేద‌ని దీని వ‌ల్ల కూలీలు అవ‌స్థ‌లు ప‌డుతున్నార‌ని ఆరోపించింది. దీని వ‌ల్ల ప్ర‌జ‌ల ప‌ర్స‌న‌ల్ స‌మాచారానికి భ‌ద్ర‌త లేద‌ని తెలుస్తోంద‌ని వెల్ల‌డించింది. దీనిపై కేంద్ర ప్ర‌భుత్వం స్పందిస్తూ.. మూడీస్ కేవ‌లం ఆరోప‌ణ‌లు చేస్తోంది కానీ ఎలాంటి ఆధారాలు చూప‌డం లేద‌ని తెలిపింది. భార‌త‌దేశంలోని కోట్ల మంది ప్ర‌జ‌లు ఆధార్ వ్య‌వ‌స్థ‌ను న‌మ్ముతార‌ని.. రోజులో కొన్ని కోట్ల మంది ఆధార్ కార్డు ద్వారా ధృవీక‌ర‌ణ ప్ర‌క్రియ‌లు చేప‌డుతున్నార‌ని పేర్కొంది.

IMF, వ‌రల్డ్ బ్యాంక్ లాంటి అతిపెద్ద సంస్థ‌లే ఆధార్ వ్య‌వ‌స్థ‌ను ప్ర‌శంసించినప్పుడు మూడీస్ ఎందుకు త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తోందో ఆ సంస్థ‌కే తెలియాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం మండిప‌డింది. ఆధార్ వ్య‌వ‌స్థ‌లో ఎలాంటి భ‌ద్ర‌తాలోపం ఉండ‌ద‌ని.. అస‌లు హ్యాక్ చేయ‌డానికి కూడా వీలు లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఇప్ప‌టికీ ఇత‌ర దేశాలు ఆధార్ కార్డు వ్య‌వ‌స్థ ప‌నితీరు గురించి తెలుసుకునేందుకు ఆస‌క్తి చూపుతున్నాయ‌ని తెలిపింది. (aadhaar)