Free Bus Travel: అబ్బాయిల ఇక్కట్లు.. ఎంత వరకు కరెక్ట్..?
Free Bus Travel: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (telangana government) అధికారంలోకి వచ్చాక చేసిన మొట్టమొదటి పని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమల్లోకి తీసుకురావడం. ఈ పథకం వల్ల అందరు అమ్మాయిలు, మహిళలు హ్యాపీగా ఉన్నారని అనుకుంటే పొరబడినట్లే. ఇటీవల ఓ మహిళ ఈ పథకం మంచిది కాదు ఉచితంగా ఏదీ ఇవ్వకూడదు అది చివరికి మధ్య తరగతిపైనే భారంగా మారుతుందని చెప్పారు. ఇది నిజం.
అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ముందు వెనకా ఆలోచించకుండా హామీలు ఇచ్చేసింది. ఇప్పటికే TSRTC ఆదాయం రూ.18 కోట్ల నుంచి రూ.11 కోట్లకు పడిపోయింది. ఇలాగే కొనసాగితే TSRTC ఉద్యోగులకు జీతాలు ఉండకపోవచ్చు. ఇవన్నీ ముందు ముందు ఎదురయ్యే సమస్యలు. ఇప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే.. ఆడవాళ్లకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో బస్సుల్లో మగవారికి జాగా లేకుండాపోతోంది. పాపం వారు టికెట్లు కొనుక్కుని బస్సు ఎక్కినప్పటికీ ఆడవారి జనాభా మరీ ఎక్కువైపోవడంతో వారికి కనీసం నిలబడే అవకాశం కూడా లేకుండాపోతోందని దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన మధు శర్మ అనే ప్రయాణికుడు వాపోయాడు.
ఉచితంగా ప్రయాణించేవారందరికీ సీట్లు దొరుకుతాయి అనుకోవడం పొరపాటు. దాంతో వారు అబ్బాయిలు కూర్చుని ఉన్న సీట్ల దగ్గరికి వెళ్లి రిక్వెస్ట్ చేసి మరీ వారి సీట్లను ఆక్రమించుకుంటున్నారట. “” నేను కాలేజ్‌కి లేట్ అవుతుందని ఉరుకులు పరుగులు పెడుతూ బస్సు ఎక్కాను. లక్కీగా ఈరోజు సీటు దొరికింది. టికెట్ తీసుకుని ప్రశాంతంగా పాటలు వింటూ విండో సీటు దగ్గర కూర్చున్నాను. ఇంతలో ఒక ఆవిడ వచ్చి బాబూ కాళ్లు నొప్పులుగా ఉన్నాయి ఏమీ అనుకోవద్దు అని నా సీటు తీసుకుంది. ఆ సమయంలో నేను ఏమీ అనలేని పరిస్థితి. ఏమన్నా మాట్లాడితే ఆడవారికి రెస్పెక్ట్ ఇవ్వరు అని అంటారు. ఎందుకొచ్చిన గొడవ అని నా సీటు ఆమెకు ఇచ్చాను. కానీ రోజూ ఇలాగే జరిగితే చాలా కష్టంగా ఉంటుంది. మేమూ మనుషులమే మాకూ కాళ్లు ఉన్నాయి.. మాకూ కాళ్ల నొప్పులు వస్తాయి“” అంటూ ఇంజినీరింగ్ చదువుతున్న ఓ కుర్రాడు NewsXకి వెల్లడించాడు.
మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణం అని పెట్టే బదులు రేట్లు సగం తగ్గించి ఉంటే బాగుండేది. ఉచితంగా ఇచ్చిన ఏ పథకం కూడా సరిగ్గా అమలైనట్లు దాఖలాలు లేవని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.