Viral News: కుక్కలు పెంచిన మనిషి..!
Viral News: ఎక్కడైనా మనుషులు కుక్కల్ని పెంచుకుంటారు. వాటి ఆలనా పాలనా చూసుకుంటూ ఉంటారు. చాలా మంది పిల్లల్ని వద్దనుకుని పెంపుడు జంతువులనే తమ కన్న బిడ్డలుగా చూసుకుంటూ ఉంటారు. కానీ పై ఫోటో కనిపిస్తున్న యువతిని మాత్రం కుక్కలే పెంచాయి. దాంతో ఆమె మనిషిలా కాకుండా కుక్కలా ప్రవర్తిస్తోంది. ఇంతకీ ఈమె కథేంటో తెలుసుకుందాం.
ఈ యువతి పేరు ఓక్సానా మలయా (Oxana Malaya). వయసు 40. పుట్టింది ఉక్రెయిన్‌లో (Ukraine). అయితే.. ఓక్సానా పుట్టిన నాలుగేళ్లకే కన్న తల్లి భారం అనుకుని రోడ్లపై వదిలేసింది. దాంతో ఎక్కడికి వెళ్లాలో తెలీక దగ్గర్లో కుక్కల బోను ఉంటే అందులోకి వెళ్లి తలదాచుకుంది. కుక్కలు కూడా పాపం ఏమీ అనేవి కావు. అలా ఎవరి ఆలనా పాలనా లేకపోవడంతో ఒక ఎనిమిదేళ్ల వచ్చే వరకు ఓక్సానా కుక్కల మధ్యే పెరిగింది. చెత్తలో దొరికినవి, కుక్కలకు దొరికినవి తింటూ బతికేది.
ALSO READ: Viral News: బిడ్డను పొరపాటున ఓవెన్‌లో పెట్టేసిన తల్లి..!
ఇలా ఉండగా.. ఓసారి ఓక్సానాను స్పెషల్ కేర్ ఇన్‌స్టిట్యూషన్‌లో పనిచేసే ఆన్నా అనే యువతి చూసింది. మనిషిలా కాకుండా రెండు చేతులను ముందుకు పెట్టి మోకాళ్లపై నడుస్తూ కనిపించింది. పక్కనే ఉన్న కుక్కల్ని చూసి ఓక్సానా కూడా అలాగే ప్రవర్తిస్తుండడం ఆన్నా కంటపడింది. దాంతో వెంటనే ఓక్సానాను తాను పనిచేస్తున్న ఇన్‌స్టిట్యూషన్‌కు తీసుకెళ్లింది. అక్కడ ఓక్సానాకు తిండి, నీళ్లు పెట్టగా… కుక్కల్లాగ నాలుకతో తినడం, తాగడం వంటివి చేయడం చూసి ఆన్నా షాకైంది. (Viral News)
వెంటనే ఆమెను వైద్యుల వద్దకు తీసుకెళ్లింది. ఓక్సానాకు పరీక్షలు చేసిన వైద్యులు ఆమె సమస్యను గుర్తించారు. సాధారణంగా పుట్టిన పిల్లలకు ఆరేళ్ల వయసు వచ్చేటప్పకే తమ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నడుచుకుంటూ ఉంటారు. ఆ ఆరేళ్లు వారి జీవితంలో చాలా కీలకం. ఓక్సానా నాలుగేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి ఎనిమిదేళ్ల వచ్చే వరకు కుక్కల మధ్య పెరగడంతో వాటి అలవాట్లే వచ్చాయని వైద్యులు తెలిపారు. కుక్కలకు నీళ్లు కనిపిస్తే నాలుక బయటపెట్టి ఆయాస పడుతున్నట్లుగా చేస్తాయి. ఓక్సానా కూడా తిండి, నీరు కనిపిస్తే ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటుంది.
అసలు ఓక్సానా పరిస్థితి ఏంటో తెలుసుకోవాలంటే ఆమె నోరు తెరిచి మాట్లాడాలి. ఇందుకోసం ఆన్నా చాలా కష్టాలు పడింది. చాలా మంది వైద్యులను సంప్రదించాక చివరికి ఓక్సానా నోరు తెరిచి మాట్లాడగలిగింది. తనకు చాలా మంది తోబుట్టువులు ఉన్నారని.. దాంతో ఇంట్లో పడుకోవడానికి స్థలం సరిపోక తన తల్లి బయట వదిలేసిందని చెప్పడంతో ఆన్నా షాకైంది. ఎలాగైనా ఓక్సానాను మనిషిలా మార్చాలని ఆన్నా కంకణం కట్టుకుంది. ఓక్సానాను కుక్కలకు ఇతర జంతువులకు దూరంగా ఉంచి కేవలం మనుషుల మధ్యలో ఉండేలా చేసింది. మనుషులు ఎలా ప్రవర్తిస్తారో ఓక్సాకు అర్థం అయ్యేలా వివరించింది. అలా ఓక్సానా కోలుకుంది.
ఎక్కువ మంది పిల్లలు ఉండడంతో రోడ్డుపై వదిలేసిన తన తల్లిని తలుచుకుని ఓక్సానా బాధపడని రోజంటూ లేదు. కన్న తల్లి ప్రేమకు దూరం అయినప్పటికీ ఓక్సానా తన తల్లిని కలవాలని ఆశపడుతోంది. ఓసారి ఓక్సానా అనుకోకుండా తన తండ్రిని చెల్లిని చూసింది. కానీ వారు కనీసం దగ్గరికి తీసుకోకపోగా అసహ్యించుకున్నారు.
పుట్టిన పిల్లలు చిన్న చిన్న పదాలను నేర్చుకోవడానికంటే ముందు భాషను గ్రహించగలుగుతారట. తమ చుట్టూ ఉన్న పరిస్థితులను గమనిస్తూ అలాగే ప్రవర్తిస్తుంటారు. పిల్లలకు ఆరేళ్లు వచ్చే వరకు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వారిని అలా వదిలేస్తే ఏ వాతావరణంలో పెరుగుతారో అక్కడి అలవాట్లనే అలవర్చుకుంటారు. ఓక్సానా విషయంలో ఇదే జరిగింది. కన్న తల్లి రోడ్డు మీద పడేయడంతో ఓక్సానా కుక్కలకు దగ్గరైంది. వాటి ప్రేమ గురించి మాత్రమే ఓక్సానాకు తెలుసు. అందుకే మనిషిలా ప్రవర్తించకుండా కుక్కలా ప్రవర్తిస్తోంది. తన ఆలోచనల్లో తాను వింతగా జన్మించిన కుక్క అనుకుంటోందని వైద్యులు చెబుతున్నారు.