Marital Rape: భార్యకు 18 ఏళ్లు నిండితే.. వైవాహిక అత్యాచారం త‌ప్పు కాద‌ట‌..!

Marital Rape: వైవాహిక అత్యాచారాన్ని కూడా నేరం కింద ప‌రిగ‌ణించాల‌ని సుప్రీంకోర్టులో ఇంకా విచార‌ణ‌లు, వాద‌న‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో అల‌హాబాద్ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. భార్య వ‌య‌సు 18 క‌న్నా ఎక్కువ ఉన్న‌ప్పుడు ఆమె భ‌ర్త బ‌ల‌వంతంగా శృంగారం చేసినా త‌ప్పు కాద‌ని అది వైవాహిక అత్యాచారంగా ప‌రిగ‌ణించ‌లేమ‌ని తీర్పు ఇచ్చింది. వైవాహిక జీవితంలో అసహ‌జ శృంగారం అనే కాన్సెప్ట్ ఉండ‌ద‌ని.. వారు భార్యాభ‌ర్త‌లు అయిన‌ప్పుడు అనుమ‌తులు తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని కూడా న్యాయ‌మూర్తి రామ్ మనోహ‌ర్ నారాయ‌ణ్ మిశ్రా తెలిపారు.

అల‌హాబాద్‌కు చెందిన ఓ మ‌హిళ త‌న భ‌ర్త కొడుతూ ఉంటాడ‌ని.. ఇష్టం లేక‌పోయినా బ‌ల‌వంతంగా శృంగారం చేస్తున్నాడ‌ని కేసు వేసారు. అయితే కోర్టు మాత్రం కేవ‌లం గృహ‌హింస విష‌యాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంది కానీ వైవాహిక అత్యాచారాన్ని మాత్రం ప‌ట్టించుకోలేదు. సుప్రీంకోర్టు ఒక నిర్ణ‌యం తీసుకునేవ‌ర‌కు వైవాహిక అత్యాచారం నేరం కింద ప‌రిగణించ‌బ‌డ‌దు అని అల‌హాబాద్ కోర్టు వెల్ల‌డించింది.