Snake Bite: తాగాడని పట్టుకున్న పోలీసులు.. పాము కాటుతో మృతి
Snake Bite: ఓ యువకుడు పాము కాటుకు గురై హాస్పిటల్‌కు వెళ్తుండగా.. మార్గ మధ్యలో అతన్ని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో అతను చికిత్స ఆలస్యమై చనిపోయాడు. ఈ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. పట్నాలోని కైమూర్ జిల్లాకు చెందిన 23 ఏళ్ల ప్రసాద్ అనే యువకుడిని నిన్న రాత్రి పాము కాటేసింది. దాంతో ప్రసాద్ పరిగెత్తుకుంటూ దగ్గర్లోని హాస్పిటల్‌కు వెళ్తుండగా.. అక్కడే పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ప్రసాద్ తాగి ఉన్నాడని అందుకే పోలీసుల నుంచి పారిపోతున్నాడనుకుని పట్టుకున్నారు.
పాపం తనను పాము కాటేసిందని అందుకే వైద్యుల దగ్గరికి వెళ్తున్నానని ఎంత చెప్పినా పోలీసులు వినలేదు. పైగా రూ.2000 ఇస్తే వదిలేస్తామని అనడంతో ప్రసాద్ తన సోదరుడికి ఫోన్ చేసి డబ్బులు తెమ్మన్నాడు. ప్రసాద్ సోదరుడు రూ.700 వరకు తేగలిగాడు. ఆ డబ్బు పోలీసులకు అందిన సమయానికే 3 గంటలు దాటిపోయింది. అప్పటికే పాము కాటుకు ప్రసాద్ శరీరం విషమంగా మారిపోయి అతను చనిపోయాడు. దాంతో ప్రసాద్ కుటుంబీకులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. విషయం పై అధికారులకు చేరడంతో దర్యాప్తుకు ఆదేశించారు.