Work Pressure: పని ఒత్తిడి తట్టుకోలేక.. కరెంట్ షాక్ పెట్టుకుని ఉద్యోగి మృతి
Work Pressure: పని ఒత్తిడి తట్టుకోలేక ఓ వ్యక్తి తనకు తానే కరెంట్ షాక్ పెట్టుకుని చనిపోయిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తళంబూర్‌కి చెందిన కార్తికేయ అనే వ్యక్తి స్థానిక కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పని ఒత్తిడి కారణంగా కార్తికేయ రెండు నెలలుగా డిప్రెషన్‌తో బాధపడుతున్నాడు. ఇందుకోసం చికిత్స కూడా తీసుకుంటున్నాడు.
నిన్న ఉదయం కార్తికేయ భార్య తన పిల్లలను తీసుకుని ఆలయానికి వెళ్లింది. వారు సాయంత్రం వచ్చి తలుపు కొడుతుంటే కార్తికేయ ఎప్పటికీ తలుపు తీయలేదు. చాలా సేపు తలుపు కొట్టాక అతని భార్య మరో తాళం చెవితో తలుపు తీసింది. తీరా చూస్తే తన భర్త లోదుస్తులతో ఒంటికి వైర్లు తగిలించుకుని అపస్మాకర స్థితిలో పడి ఉండటం చూసి కేకలు వేసింది. స్థానికుల సాయంతో పోలీసులకు సమాచారం అందించగా.. వారు కార్తికేయను స్థానిక ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కరెంట్ షాక్ వల్ల కార్తికేయ చనిపోయి చాలాసేపైంది అని వైద్యులు చెప్పారు. దాంతో పోలీసులు అసహజ మరణం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల ఎర్న్‌స్ట్ అండ్ యంగ్ అనే కంపెనీలో కేరళకు చెందిన ఆన్నా అనే యువతి పని ఎక్కువై చనిపోవడం యావత్ భారతదేశంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కనీసం ఆన్నా అంత్యక్రియలకు కూడా కంపెనీ నుంచి ఒక్కరూ రాలేదని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. దాంతో ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేపడుతోంది.