ప్రేమ.. పెళ్లి.. మర్డర్ ప్లాన్.. ఎందుకో తెలుసా?
తల్లిదండ్రులు వద్దంటున్నా వారిని ఎదిరించి మరీ ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది. చివరికి కట్టుకున్న భర్తను, అత్తింటివారిని విషయం పెట్టి చంపేసింది. ఈ ఘటన మహారాష్ట్రలో (maharashtra) చోటుచేసుకుంది.
ఎవరీ మహిళ?
ఈమె మహారాష్ట్రలోని అకోలా ప్రాంతానికి చెందిన మహిళ. పేరు సంఘమిత్ర. ఈమె రోషన్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఇంట్లో వారు వద్దంటున్నా వారి మాట వినకుండా 2022 డిసెంబర్‌లో రోషన్‌ను పెళ్లి చేసుకుంది.
తర్వాత ఏం జరిగింది?
పెళ్లి అయిన ఆరు నెలల వరకు అంతా బాగానే ఉంది. ఆ తర్వాత భర్త, అత్తింటివారి నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సంఘమిత్రను చావగొట్టేవారు. సూటిపోటి మాటలు అనేవారు. రాఖీ పండుగకు ఇంటికి వెళ్లి వస్తానన్నా కూడా ఒప్పుకోలేదు. అప్పటికీ ఒక్కసారి వెళ్లి వస్తానండీ అంటూ సంఘమిత్ర బ్రతిమాలుతున్నా వినకపోగా రోషన్ ఆమెపై చేయి చేసుకున్నాడు. (maharashtra)
దాంతో ఇంటి బయట సంఘమిత్ర ఏడుస్తూ కూర్చుంది. సంఘమిత్రను చూసిన రోసా రాంతేకే అనే మహిళ ఆమెను ఓదార్చింది. రోసా రాంతేకే ఎవరో కాదు. సంఘమిత్ర అత్తగారికి ఆడపడుచు. ఆమె ఒక్కత్తే సంఘమిత్ర పట్ల స్నేహపూర్వకంగా ఉండేది. అప్పుడే సంఘమిత్ర తన భర్తను, అత్తింటివారిని చంపేయాలని ఉంది అని తన కోపాన్ని రోసాతో పంచుకుంది.
ఆ ప్లాన్ రోసాకు కూడా నచ్చింది. ఎందుకంటే సంఘమిత్ర అత్తగారికి ముగ్గురు సోదరీమణులు, ఒక సోదరుడు ఉన్నాడు. ఆ సోదరుడి భార్యే ఈ రోసా. ఒక భూమి విషయంలో ఎప్పటినుంచో రోసాకి సంఘమిత్ర అత్తగారికి గొడవలు జరుగుతున్నాయి. ఆ భూమి ఇంట్లోని ఏకైక మగవాడైన తన భర్తకే చెందాలి అని రోసా పట్టుబట్టింది.
ఇక సంఘమిత్ర కూడా తనతో కలిసిపోవడంతో ఇద్దరూ కలిసి ఆ కుటుంబాన్ని అంతం చేయాలనుకున్నారు. అలా గూగుల్‌లో అనుమానం రాకుండా ఎలా చంపాలో సమాచారం కోసం వెతికేవారు.
ఇలా మర్డర్ చేసారు
కుటుంబాన్ని చంపడానికి రోసా, సంఘమిత్ర ఆన్‌లైన్‌లో ఒక విషపూరితమైన పువ్వులను ఆర్డర్ పెట్టి వాటిని తినే ఆహారంలో కలిపాలని అనుకున్నారు. కానీ ఆన్‌లైన్ షాపింగ్ అంటే దొరికిపోతామని ఆ ప్లాన్‌ను విరమించుకున్నారు.
ఆ తర్వాత తాలియం అనే విషపూరితమైన మెటల్ గురించి తెలుసుకున్నారు. ఇది సేవించాక నిదానంగా మనిషి ప్రాణాలను తీస్తుంది. పైగా దీనిని తెలంగాణ నుంచే తెప్పించుకున్నారు. అలా సెప్టెంబర్ 15న రోసా, సంఘమిత్రలు కలిసి వండి వంటకాల్లో తాలియంను కలిపారు. వారు మాత్రం సపరేట్‌గా వండుకుని తినేవారు. అప్పటివరకు అంతా బాగానే ఉన్నారు. సెప్టెంబర్ 20న తాలియం కలిపిన వంటలు తిన్నవారికి పెదాలు నల్లగా అయిపోవడం.. విపరీతమైన ఒళ్లు నొప్పులు రావడం వంటి లక్షణాలు కనిపించాయి.
ఏమీ తెలీనట్లు వారిని రోసా, సంఘమిత్రలు కలిసి హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు అసలు ఏం జరిగిందో పరీక్షించి తెలుసుకునేలోపే మూడు రోజుల్లో కుటుంబంలోని వారంతా ఒక్కొక్కరిగా చనిపోయారు.
అనుమానం రావడంతో పోలీసులు రోసా, సంఘమిత్రలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాలియం అనే మెటల్‌తో చంపేసామని చెప్పడంతో పోలీసులు కూడా షాకయ్యారు. అసలు ఆ మెటల్ సాధారణంగా ఎక్కడా దొరకదు. కానీ వారికి ఎవరు ఇచ్చారు అనేదానిపై విచారణ చేపడుతున్నారు.