Maharashtra: దారుణం.. నిద్రలోనే 25 మంది సజీవదహనం
Maharashtra: మహారాష్ట్రలో (maharashtra) దారుణం చోటుచేసుకుంది. బుల్దానా నగరంలోని సమృద్ధి నుంచి మహామార్గ్ ఎక్స్‌ప్రెస్‌వే వైపు వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో 25 మంది దుర్మరణం చెందారు. తెల్లవారుజామున 1:35 ప్రాంతంలో బస్సు టైరు పేలి బోల్తా పడింది. దాంతో బస్సులోని డీజిల్ పైప్ పగిలిపోయి మంటలు వ్యాపించాయి. అప్పటికే డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతో బయటికి దూకేసి ప్రాణాలు కాపాడుకున్నాడు.
బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో 25 మంది నిద్ర నుంచి తేరుకునేలోపే మంటల్లో సజీవదహనమయ్యారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని దగ్గర్లోని హాస్పిటల్‌కు తరలించారు. బస్సులోని ఇద్దరు డ్రైవర్లలో ఒక డ్రైవర్ తప్పించుకున్నాడు కానీ మరొకరు మంటల్లో కాలిపోయారు. బస్సు తలుపులు ఉండే వైపు బోల్తా పడటంతో ప్రయాణికులు బయటికి రాలేకపోయారని స్థానికులు చెప్తున్నారు. విదర్భా ట్రావెల్స్‌కు చెందిన ఈ బస్సు నాగ్‌పూర్ నుంచి పుణె వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి ఏకనాథ్ శిండే ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం ప్రకటించారు.