Telangana: ఉచిత బ‌స్సు ప్ర‌యాణం.. మ‌హిళ‌లు దేనికి వాడుతున్నారో తెలుసా?

Telangana: తెలంగాణ ప్ర‌భుత్వం మ‌హాల‌క్ష్మి ప‌థ‌కంలో (mahalakshmi scheme) భాగంగా ప్ర‌వేశ‌పెట్టిన ఉచిత బ‌స్సు ప్ర‌యాణాన్ని మ‌హిళ‌లు బాగా స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే ఎక్కువ‌గా మ‌హిళ‌లు ఎందుకోసం ఈ ప‌థ‌కాన్ని వాడుకుంటున్నారో తెలుసా?

వైద్య ప‌రీక్ష‌ల కోసం వాడుకుంటున్నార‌ట‌. మీరు చ‌ద‌వింది నిజ‌మే. చాలా మ‌టుకు మ‌హిళ‌లు ఉచిత బస్సు ప్ర‌యాణం ద్వారా వైద్య ప‌రీక్ష‌ల కోసం, హాస్పిట‌ల్స్‌కి వెళ్లి రావ‌డం కోస‌మే వాడుకుంటున్నారు. హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేష‌న్ అనే ఎన్జీఓ ఏర్పాటుచేసిన సర్వేలో ఈ విష‌యం తేలింది. దాదాపు 15 రోజుల్లో 3,530 మంది మ‌హిళ‌ల‌తో స‌ర్వే నిర్వ‌హించ‌గా.. వారిలో 35% మంది ఈ ఉచిత బ‌స్సు ప్ర‌యాణం ద్వారా రూ.1000 వ‌ర‌కు ఆదా చేసుకుంటున్నారు. ఈ 35% మందిలో 33% మంది హాస్పిట‌ల్స్‌కి వెళ్లి రావ‌డం కోసమే బ‌స్సు ఎక్కుతున్నారు.

ఉస్మానియా జ‌న‌ర‌ల్ హాస్పిట‌ల్, గాంధీ హాస్పిట‌ల్, నిమ్స్ హాస్పిట‌ల్స్‌లో వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డానికి వ‌చ్చే మ‌హిళ‌ల సంఖ్య ఎక్కువ‌గా ఉన్న‌ట్లు తేలింది. వీరంతా కూడా బ‌స్సుల్లోనే హాస్పిట‌ల్స్‌కు వ‌చ్చి వెళ్తున్నారు.