Kolkata Rape Case: ఆ అమ్మాయి సంగతి పక్కనపెట్టి దసరా ఉత్సవాలపై దృష్టి పెట్టండి
Kolkata Rape Case: కలకత్తాలో హత్యాచారానికి గురైన ట్రైనీ వైద్యురాలి కేసు విషయమై వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ షాకింగ్ వ్యాఖ్యలు చేసారు. సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ జూనియర్ డాక్టర్లు విధుల్లో చేరకుండా నిరసనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ స్పందిస్తూ.. ఇక ఆ మృతురాలి విషయం పక్కన పెట్టి దసరా ఉత్సవాలు వస్తున్నాయి కాబట్టి దానిపై దృష్టి పెట్టాలని షాకింగ్ వ్యాఖ్యలు చేసారు.
దీనిపై మృతురాలి తల్లి స్పందిస్తూ మమతపై ధ్వజమెత్తారు. “” గతేడాది వరకు నా కూతురితో దసరా ఉత్సవాలతో పాటు అన్ని పండుగలు చేసుకున్నాం. ఇప్పుడు మా బిడ్డ మాతో లేదు. ఇక మేం ఎలాంటి పండుగలు చేసుకోం. మమతను ముందు నా కూతురిని నాకు తెచ్చి ఇవ్వమనండి. ఆమెకు ఓ కూతురు ఉండి తన పట్ల కూడా ఇలాగే జరిగితే అన్నీ మర్చిపోయి దసరా ఉత్సవాలు చేసుకుంటుందా? అసలు మమత తెలివి ఉండే మాట్లాడుతోందా “” అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.
మరోపక్క తమ బిడ్డ హత్యాచారానికి గురైనప్పుడు పోలీసులు తమకు డబ్బులు ఇచ్చి నోరు నొక్కేయాలని చూసారని మృతురాలి తల్లి మీడియా ద్వారా బయటపెట్టారు. ఇదంతా పచ్చి అబద్ధం అని పోలీసులు ఎలాంటి డబ్బు ఇవ్వలేదని మమత అన్నారు. దాంతో మృతురాలి తల్లి ఆగ్రహం వ్యక్తం చేసారు. బిడ్డ విషయంలో అబద్ధం చెప్పాల్సిన అవసరం తనకు లేదని మమత కావాలనే తన బిడ్డ విషయంలో న్యాయం జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.