భారత్‌ను విడదీసి మరిన్ని దేశాలను సృష్టించాలని..!
ఖలిస్తానీ ఉగ్రవాది (khalistani) గుర్పత్వంత్ సింగ్ పన్నున్ (gurpatwant singh pannun) భారత్‌ను విడదీసి మరిన్ని దేశాలను సృష్టించాలన్న కపట బుద్ధితో ప్లాన్ వేయాలనుకున్నాడని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఇటీవల పంజాబ్‌లో ఉన్న పన్నున్ ఆస్తులను జప్తు చేసారు. 2019 నుంచి పన్నున్ నేషనల్ ఇన్‌వెస్టిగేటివ్ ఏజెన్సీ లిస్ట్‌లో వాంటెడ్‌గా ఉన్నాడు. పంజాబ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో ద్వేషపూరిత చర్యలకు పాల్పడిన పన్నున్‌ను 2020లో భారత్ ఉగ్రవాదిగా ముద్రించింది. అయితే అందుకు సరైన ఆధారాలు లేవని అతన్ని పట్టుకోవడానికి రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వలేమని ఇంటర్‌పోల్ రెండు సార్లు భారత్ అభ్యర్ధనను తిరస్కరించింది. ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ రా ఏజెంట్ కుట్ర ఉందని వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో పన్నున్ భారత ప్రభుత్వాన్ని.. కెనడాలో ఉన్న భారత అధికారులను బెదిరిస్తున్నాడు.
ఎవరీ పన్నున్?
దేశ విభజన తర్వాత 1947 సంవత్సరంలో అమృత్‌సర్‌లో స్థిరపడ్డాడు పన్నున్. ముస్లింలను రెచ్చగొట్టి వారి ద్వారానే ముస్లింలకు సపరేట్ దేశాన్ని సృష్టించాలనేది పన్నున్ ప్లాన్. అలా కొత్త దేశం ఏర్పడితే దానికి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఉర్దుస్తాన్ అని పేరు పెట్టాలనుకున్నాడు. ఇతని తల్లిదండ్రులు పాకిస్తాన్‌లో ఉండేవారు. ఇప్పుడు బతికి లేరు. ఉన్న ఒక్క సోదరుడు పంజాబ్ యూనివర్సిటీలో డిగ్రీ పట్టా పొంది విదేశాల్లో స్థిరపడ్డాడు. ఇప్పటివరకు భారత్‌లో పన్నున్‌పై 16 కేసులు నమోదయ్యాయి.
వీటిలో తొమ్మిదవ కేసును నేషనల్ ఇన్‌వెస్టిగేటివ్ ఏజెన్సీ నమోదు చేసింది. ఇందుకు కారణం పన్నున్.. ఇండియా గేట్ వద్ద ఎవరైతే ఖలిస్తానీ జెండాను ఎగరేస్తారో వారికి 2.5 మిలియన్ డాలర్లు రివార్డ్ ఇస్తానని ప్రకటించాడు. 2021లో ఢిల్లీలోని ఎర్ర కోట వద్ద భారత జాతీయ జెండాను ఎగరేయకుండా ఎవరైనా అడ్డుపడితే వారికి 1 మిలియన్ డాలర్లు ఇస్తానని కూడా తెలిపాడు. గతవారం నేషనల్ ఇన్‌వెస్టిగేటివ్ ఏజెన్సీ అమృత్‌సర్, ఛండీగడ్‌లో ఉన్న పన్నున్ ఆస్తులను జప్తు చేసింది. ఇప్పుడు అవి కేంద్ర ప్రభుత్వం ఆదీనంలో ఉన్నాయి.