Sukha Duneke: కెన‌డాలో మరో ఖ‌లిస్తానీ ఉగ్ర‌వాది హ‌తం

కెన‌డాలో (canada) మ‌రో ఖ‌లిస్తానీ ఉగ్ర‌వాది (khalistani terrorist) హ‌తమ‌య్యాడు. పంజాబ్‌కి చెందిన సుఖ్‌దూల్ సింగ్ అలియాస్ సుఖా దునేకే (sukha duneke) బుధ‌వారం రాత్రి హ‌త‌మ‌య్యాడు. కెన‌డాలో జ‌రిగిన గ్యాంగ్ గొడ‌వ‌ల్లో సుఖా హ‌త‌మైన‌ట్లు ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఓ ప‌క్క ఖ‌లిస్తానీ ఉగ్ర‌వాది అయిన హ‌ర్దీప్ సింగ్ నిజ్జ‌ర్ హ‌త్య‌లో భార‌త రా అధికారి హ‌స్తం ఉంద‌ని ఆరోపించిన కెన‌డా వెంట‌నే అత‌న్ని కెన‌డా నుంచి బ‌హిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే.

2017లో సుఖా ఫోర్జరీ డాక్యుమెంట్ల‌తో కెన‌డా పారిపోయాడు. అత‌నిపై ఎన్నో క్రిమిన‌ల్ కేసులు ఉన్నాయి. పంజాబ్‌కి చెందిన దాదాపు 29 మంది గ్యాంగ్‌స్ట‌ర్లు ఇండియాకి దూరంగా ఉంటూ ఉగ్ర‌వాద చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. నేపాల్ స‌రిహ‌ద్దు ద్వారా అక్ర‌మంగా భార‌త్‌ను వీడి ఇత‌ర దేశాల్లో త‌లదాచుకుంటున్నారు. పంజాబ్, ఢిల్లీ, హ‌ర్యానా, రాజ‌స్థాన్‌ల‌లో ద‌వీంద‌ర్ బంబీహా గ్యాంగ్‌ను ఏర్పాటుచేసేందుకు సుఖా ఫండింగ్ చేస్తున్నాడు. ఇత‌ను ఎక్కువగా సుపారీ హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతుండేవాడు. 2022 మార్చిలో జ‌లంధ‌ర్‌లోని మ‌ల్లియ‌న్ గ్రామంలో క‌బ‌డ్డీ మ్యాచ్ జ‌రుగుతుండ‌గా.. క‌బ‌డ్డీ క్రీడాకారుడు అయిన సందీప్ సింగ్ నంగ‌ల్‌ను చంపేందుకు సుఖా య‌త్నించాడు. ఇలా పంజాబ్‌లోనే ఎన్నో నేరాల‌కు పాల్ప‌డ్డాడు. ఇప్పుడు ఇత‌ని పీడ కూడా వ‌దిలిపోయింది. (sukha duneke)