Kerala Blasts: లొంగిపోయిన బాంబు పేలుళ్ల సూత్రధారి
కేరళలోని (kerala blasts) ఎర్నాకుళం (ernakulam) జిల్లాలోని కలమస్సెరీ (kalamassery) ప్రార్థనా కన్వెన్షన్ సెంటర్లో ఈరోజు వరుసగా మూడు బాంబు పేలుళ్లు సంభవించాయి. దాంతో రాష్ట్రం ఉలిక్కి పడింది. మూడు రోజులుగా ఇదే ప్రార్ధనా సెంటర్లో ప్రార్ధనలు జరుగుతున్నాయి. ఈరోజు ఆఖరి రోజు కావడంతో అంతా ధ్యానంలో ఉండగా ఒక్కసారిగా మొదటి బాంబు పేలుడు సంభవించింది.
ఈ ఘటనలో ఒక మహిళ సాయం ఆలస్యం అవడంతో మృతిచెందగా మరో 30 మందికి గాయాలయ్యాయి. ఒక టిఫిన్ బాక్సులో ఎవరో IED పదార్థం పెట్టడంతో అది పేలింది. ఈ పేలుళ్ల వెనుక ఉగ్రకోణం ఉందేమోనన్న సందేహంలో యాంటీ టెర్రర్ స్వ్కాడ్, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి తానే ఈ పేలుళ్లకు పాల్పడినట్లు పోలీసులకు లొంగిపోయాడు. దాంతో పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. అయితే అతనే ప్రధాన సూత్రధారా లేక కావాలనే ఇలా పోలీసుల దగ్గర లొంగిపోయాడా అనేది తెలియాల్సి ఉంది. అందుకే పోలీసులు కూడా విచారించాక అతని వివరాలు తెలుపుతాం అంటున్నారు. (kerala bomb blasts)
మిస్టరీ కారు
పేలుళ్లు సంభవించిన కొన్ని నిమిషాల్లోనే ఒక కారు వేగంగా వెళ్తుండడం పోలీసులు సీసీ కెమెరాల్లో గమనించారు. బాంబులు అమర్చిన వ్యక్తే కారులో పారిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పేలుళ్లు సంభవించిన ప్రదేశంలో ఎలాంటి అనుమానిత వస్తువులు లభించలేదని తెలిపారు. పేలుళ్లు సంభవించినప్పుడు కన్వెన్షన్ సెంటర్లో దాదాపు 2000 మంది ఉన్నారు.
ఢిల్లీ అలెర్ట్
కేరళలో పేలుళ్లు సంభవించిన నేపథ్యంలో రాజధాని ఢిల్లీలో అంతా అలెర్ట్ అయ్యారు. ఎప్పటికప్పుడు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. పోలీసు బలగాలను ప్రధాన రోడ్లపై నియమించారు.