భార్య మోసం తెలిసి.. 230 కిమీలు ప్రయాణించి మరీ హత్య
Karnataka: కట్టుకున్న భార్య మరొకరితో ఎఫైర్ పెట్టుకుని మోసం చేస్తోందని తెలిసి ఆ భర్త తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా పగ తీర్చుకోవాలని ఏకంగా 230 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. చామరాజనగర్‌కు చెందిన కిశోర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి ప్రతిభ అనే యువతితో పెళ్లైంది. 11 రోజుల క్రితమే ప్రతిభ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రతిభకు మరో వ్యక్తితో ఎఫైర్ ఉందని ఎప్పటి నుంచో కిశోర్‌కు అనుమానం ఉంది.
తన కాలేజీ స్నేహితులతో సన్నిహితంగా ఉంటోందని తెలిసి ఆమెపై నిఘా ఉంచాడు. ప్రసవం కోసం హోస్‌కోటెలోని తన పుట్టింటికి వెళ్లిన ప్రతిభకు నిన్న కిశోర్ ఏకధాటిగా ఫోన్ కాల్స్ చేస్తూనే ఉన్నాడు. దాదాపు 150 సార్లు కాల్స్ చేసి ఉంటాడు. అయినా ప్రతిభ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దాంతో కిశోర్‌కు ఒళ్లుమండిపోయింది. ఆ బిడ్డ కూడా తనకు పుట్టలేదేమో అని అనుమానంతో రగిలిపోయాడు. ఎలాగైనా ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. ప్రతిభను చంపడానికి ముందు కిశోర్ పురుగుల మందు తాగాడు. ఆ తర్వాత ప్రతిభ గదిలోకి ప్రవేశించి చున్నీతో ఆమె మెడను బిగించాడు. ప్రతిభ తల్లికి అనుమానం వచ్చి తలుపులు బాదుతున్నా తెరవలేదు. దాదాపు 15 నిమిషాల తర్వాత దానిని చంపేసాడు అనుకుంటూ కిశోర్ పరుగులు తీసాడు. ప్రతిభ అక్కడికక్కడే చనిపోగా కిశోర్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.