Italy: కూలిపోయే స్థితిలో వెయ్యేళ్ల నాటి టవర్..!
Italy: ఇటలీకి చెందిన వెయ్యి ఏళ్ల నాటి గారిసెండా టవర్ (garisenda tower) కూలిపోయే స్థితిలో ఉంది. ఇటలీలోని బోలోనా (bologna) ప్రాంతంలో ఉన్న ఈ టవర్ పీసా టవర్ మాదిరిగా కాస్త వంగినట్లుగా ఉంటుంది. అందుకే దీనిని లీనింగ్ టవర్ అని పిలుస్తారు. దాదాపు 150 మీటర్ల ఎత్తు ఉన్న ఈ టవర్ ఇప్పుడు కూలిపోయేంతగా వంగిపోయి ఉంది. దాంతో ఎప్పుడు విరిగి చుట్టు పక్కల ఉన్న భవంతులపై పడుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఈ టవర్ నాలుగు డిగ్రీల మేర వంగి ఉంటుంది. ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన పీసా టవర్ (pisa tower) ఐదు డిగ్రీల మేర వంగి ఉంటుంది. అలాంటి పీసా టవర్ ఇప్పటికీ స్థిరంగా ఉంది కానీ గారిసెండా టవర్ మాత్రం కూలిపోయే స్థితిలోకి వచ్చేసింది. దాంతో ఇటలీ ప్రభుత్వం గారిసెండా టవర్ చుట్టూ ఇనుప కంచెలు వేసి ఉంచారు. ఒకవేళ ఆ టవర్ ఉన్నట్టుండి కూలిపోయినా ఎవ్వరికీ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఆ ఇనుప కంచెల్లోనే కూలిపోయేలా ప్లాన్ చేస్తున్నారు.