ఇంట్లో ఎంత వరకు నగదు పెట్టుకోవచ్చు? ఐటీ రూల్స్ ఏం చెప్తున్నాయ్?
Cash: ఇటీవల ఝార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు (dhiraj sahu) ఇంట్లో రూ.350 కోట్ల నోట్ల కట్టలు దొరకడంతో అసలు ఇంట్లో ఎంత వరకు డబ్బు పెట్టుకోవచ్చు అనే అంశంపై చర్చ నెలకొంది. ఇన్‌కం ట్యాక్స్ రూల్స్ ప్రకారం ఎంత వరకు డబ్బు ఇంట్లో పెట్టుకోవాలి.. ఒకవేళ ఎక్కువ ఉంటే ఏమవుతుంది? వంటి విషయాలను తెలుసుకుందాం.
ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎంపీ ధీరజ్ సాహు ఇంట్లో దొరికినదంతా నల్ల ధనం అనుకుంటే పొరపాటే. అందులో కొంత భాగం వరకే ట్యాక్స్ ఎగ్గొట్టిన డబ్బు కిందికి వస్తుంది. మిగతాదంతా ఆయన లిక్కర్ కంపెనీలకు చెందిన డబ్బే. ఇది నిజమా కాదా అని తెలుసుకునేందుకు ఐటీ అధికారులకు సరైన డాక్యుమెంట్లు చూపించాల్సి ఉంటుంది. అందరి ఇళ్లల్లో అంత డబ్బు ఉండటం సాధ్యం కాకపోవచ్చు. ఒకవేళ ఉన్నా అందరూ ట్యాక్సులు ఎగ్గొట్టి దాచి ఉంటారు అనుకోవడానికి లేదు.
ఒకవేళ అనుకోకుండా ఇన్‌కం ట్యాక్స్ రెయిడ్లు జరిగితే ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బు దొరికినట్లైతే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చి ఎన్ని వ్యాపారాలు ఉన్నాయి ఎన్ని లావాదేవీలు జరిగాయి వంటి లెక్కలు చూపించాల్సిందే. ఒకవేళ ఇవేవీ చూపించకుండా అంతా నా డబ్బే అంటే మాత్రం ఐటీ అధికారులు ఊరుకోరు. దొరికిన మొత్తంపై 137% జరిమానా వసూలు చేస్తారు.
గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు
ఒకవేళ మీరు రూ.20,000 లేదా అంతకుమించి లోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం కచ్చితంగా నగదు రూపంలో తీసుకోకూడదు. ఇందుకు బ్యాంకులు కూడా ఒప్పుకోవు.
మీరు డిపాజిట్ చేసుకోవాలన్నా కూడా రూ.20,000 లేదా అంతకుమించి నగదు బ్యాంకుల్లో జమ చేయడానికి వీల్లేదు.
రూ.50,000 నగదు జమ చేస్తున్నా లేదా విత్‌డ్రా చేసుకుంటున్నా కూడా కచ్చితంగా PAN నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఏవైనా స్థిరాస్తులు కొనుగోలు లేదా అమ్మకాలు చేసేటప్పుడు మీరు రూ.30 లక్షలు లేదా అంతకుమించి నగదు రూపంలో చేస్తే ఐటీ కన్ను కచ్చితంగా పడుతుంది.
క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో రూ.1 లక్ష లేదా అంతకుమించి లావాదేవీలు చేసినా ఐటీ నిఘా ఉంటుంది.
ఒక ఏడాదిలో రూ.కోటికి మించి డబ్బు విత్‌డ్రా చేసుకుంటే 2% టీడీఎస్ కట్ అవుతుంది.
ఏడాదిలో రూ.20 లక్షలు లేదా అంతకుమించి ఆన్‌లైన్ లావాదేవీలు జరిగితే జరిమానాలు పడతాయి. రూ.30 లక్షలు లేదా అంతకుమించి ఏవైనా ప్రాపర్టీల అమ్మకాలు జరిగితే మాత్రం ఐటీ అధికారులు తలుపు తట్టే ప్రమాదం ఉంది.
కుటుంబ సభ్యుల నుంచి రోజుకు రూ.2లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ తీసుకోవడానికి కూడా వీల్లేదు. రూ.20,000 నగదు ఇతరుల నుంచి అప్పుగా తీసుకోవడం కూడా నిషేధం. ఒకవేళ తీసుకున్నా ఎలా తెలుస్తుందిలే అనుకుంటే మీకు ఎవరైతే ఇచ్చారో వారు కచ్చితంగా బ్యాంక్ నుంచే తీసి ఇచ్చి ఉంటారు. దాంతో వారు చిక్కుల్లో పడతారు.