Instagram వాడుతున్నారా? ఈజీగా మోస‌పోతారు!

Hyderabad: ఈ మ‌ధ్య‌కాలంలో ఇన్‌స్టాగ్రామ్ (instagram) వాడ‌కం విప‌రీతంగా పెరిగిపోయింది. దాంతో ఆన్‌లైన్ మోసాల‌కు పాల్పడేవారికి ఇదో వ‌రంగా మారింది. మీకు తెలిసినవారి అకౌంట్‌నే ఫేక్ అకౌంట్‌లా క్రియేట్ చేసుకుని మ‌రీ ఫ్రాడ్‌కి పాల్ప‌డుతున్నారు. ఇలాంటి ఘ‌ట‌నే హైద‌రాబాద్‌కు (hyderabad) చెందిన ఓ అమ్మాయికి జ‌రిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మార్కెటింగ్ ఇన్‌ఫ్లుయెన్స‌ర్లు పార్ట్ టైంలో అంత సంపాదించండి ఇంత సంపాదించండి అని పోస్ట్‌లు పెడుతుంటారు. వారిలో కొంద‌రు నిజాయ‌తీగా ఉంటారు. అలాంటివారు డ‌బ్బులు చెల్లిస్తే రెట్టింపు సంపాదించుకోవ‌చ్చు లాంటి స్కామ్స్ ఏమీ చేయ‌రు. ఈ హైదరాబాద్ అమ్మాయికి జ‌రిగిన ఘ‌ట‌న గురించి తెలిస్తే.. మీకు వెంట‌నే ఇన్‌స్టాగ్రామ్ వాడ‌టమే మానేస్తారేమో. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. బిజ్ గురుకుల్ అనే గ‌వ‌ర్న‌మెంట్ రిజిస్ట‌ర్డ్ వెబ్‌సైట్ ఎన్నో ఆన్‌లైన్ కోర్సులు అందిస్తోంది. ఈ బిజ్ గురుకుల్ కంపెనీ త‌ర‌ఫున గౌరీ అనే అమ్మాయి అఫీలియేట్ మార్కెట‌ర్‌గా ప‌నిచేస్తోంది. దీని గురించి మీరూ తెలుసుకోవాల‌నుకుంటే నా అకౌంట్‌ని ఫాలో చేయండి అని పోస్ట్ పెట్టింది.

అలా చాలా మంది గౌరీ అకౌంట్‌ను ఫాలో అయ్యారు. ఫాలో అయిన వారిలో హైద‌రాబాద్‌కి చెందిన అమ్మాయి కూడా ఉంది. అయితే ఆ అమ్మాయి గౌరీ అకౌంట్ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ మెసేజ్ వ‌చ్చింది. బైనాన్స్ (binance) యాప్ ద్వారా 3000 ఇన్‌వెస్ట్ చేస్తే వారం రోజుల్లో 40,000 సంపాదించుకునే అవ‌కాశం ఉంద‌ని, కావాలంటే నేను నేర్పిస్తాను.. అందుకు వ‌చ్చిన లాభంలో 10% ఇవ్వు అని మెసేజ్‌లో రాసుంది. మెసేజ్ చేసింది గౌరీనే క‌దా.. మోసం అయివుండ‌దులే అని ఆ అమ్మాయి గౌరీ అడిగినంత డ‌బ్బు బైనాన్స్ యాప్‌లో ఇన్వెస్ట్ చేస్తూ వ‌చ్చింది. అలా రూ.3000ల‌తో మొద‌లైన ఇన్‌వెస్ట్‌మెంట్ రూ.25,000 చేరింది.

ఆ అమ్మాయికి అనుమానం వ‌చ్చింది కానీ అప్ప‌టికే జ‌ర‌గాల్సిన మోసం జ‌రిగిపోయింది. తీరా చూస్తే ఆ అకౌంట్ గౌరీది కాదు. గౌరీ పేరుతో నైజీరియా నుంచి ఎవ‌రో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి గౌరీనే మాట్లాడుతున్న‌ట్లు న‌మ్మ‌బ‌లికారు. ఈ విష‌యాన్ని ఆ అమ్మాయి గౌరీకి ఫోన్ చేసి చెప్ప‌డంతో ఆమె కూడా షాకైంది. సైబ‌ర్ కంప్లైంట్ ఇవ్వాల‌నుకుంది కానీ.. ఇక్క‌డ సైబ‌ర్ సిస్ట‌మ్ ఉండి కూడా వేస్టే. ఎందుకంటే.. ఇప్ప‌టివ‌ర‌కు రోజుకు కొన్ని వేల‌ల్లో సైబ‌ర్ కంప్లైంట్లు వ‌స్తుంటాయి. వాటిలో ఒక్క‌టి కూడా ప‌రిష్కారం అయిన‌ట్లు దాఖ‌లాల్లేవు. ఏదో మూకుమ్మడిగా 100 మంది వ‌రకు మోస‌పోయి అంతా క‌లిసి పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి మీడియా ముందు ర‌చ్చ చేస్తే త‌ప్ప నిందితుల‌ను ప‌ట్టుకోవ‌డంలేదు. కాబ‌ట్టి ఇన్‌స్టాగ్రామ్ అనే కాదు.. ఏ సోష‌ల్ మీడియాలో అయినా బిజినెస్ డీల్ అని ఎవ‌రైనా మెసేజ్ చేస్తే వెంట‌నే రిపోర్ట్ చేయండి. జాగ్ర‌త్త‌..!