తిండి విషయంలో భారత్ వెనకే G20 దేశాలు
India: ఆహార వినియోగ నమూనా విషయంలో G20 దేశాలతో పోలిస్తే భారతదేశమే అత్యంత సుస్థిరమైనదిగా వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ (WWF) నివేదికలో పేర్కొంది. ఇతర దేశాలు భారతదేశ నమూనాను అనుసరిస్తే… 2050 నాటికి భూగ్రహంపై తక్కువ ప్రతికూల ప్రభావం ఉంటుందని WWF వెల్లడించింది. అమెరికా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా వంటి దేశాల ఆహార వినియోగాన్ని ప్రపంచం అనుసరించడం మొదలుపెడితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందంట. దీని వల్ల గ్రీన్ హౌస్ వాయువులు 263 శాతం పెరుగుతాయి.
అదే జరిగితే ఆహారాన్ని పండించేందుకు ఒక భూమి కాదు ఏకంగా 7 భూగ్రహాలు అవసరం అవుతాయి. ఇతర దేశాలతో పోలిస్తే అర్జెంటీనా డేంజర్ లెవెల్స్‌లో ఉంది. ఆ తరువాత స్థానాల్లో ఆస్ట్రేలియా, అమెరిక, బ్రెజిల్, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్ ఉన్నాయి. భారతదేశం సుస్థిర ఆహార వినియోగ పరంగా అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత స్థానాల్లో ఇండోనేషియా, చైనా, జపాన్, సౌదీ అరేబియా ఉన్నాయి. భారతదేశ ప్రస్తుత ఆహార వినియోగ ప్రక్రియను ప్రపంచం మొత్తం అనుసరిస్తే ఆహార ఉత్పత్తి కోసం 0.84 భూములు మాత్రమే అవసరం అవుతాయి.
నివేదికలో భారత తృణధాన్యాల (Millets) మిషన్‌కి ప్రశంసలు లభించాయి. పోషకాలు సమృద్ధిగా ఉండే మారుమూల భూముల్లో కూడా పండగలిగే వాతావరణ మార్పుల ప్రభావాలను తట్టుకోగల సామర్థ్యం కేవలం మిల్లెట్స్‌కి మాత్రమే ఉంది. సుస్థర ఆహార వినియోగాన్ని అలవర్చుకోవడం వల్ల ఆహార ఉత్పత్తికి అవసరమయ్యే భూమిని తగ్గించడం సాధ్యమవుతుంది. ముఖ్యంగా పశువుల మేత భూములను ఇతర అవసరాలకు, సహజ వనరుల పునరుద్ధరణ కార్బన్ నిల్వ చేయడానికి వాడుకోవచ్చు. ఆహార వ్యవస్థలను సుస్థిరంగా ఉంచడానికి పప్పుధాన్యాలు, పోషకాలు సమృద్ధిగా ఉండే మిల్లెట్లు, మొక్కల ఆధారిత మాంసపు ప్రత్యామ్నాయాలు, పోషకాలు అధికంగా ఉండే ఆల్గీ జాతులను ప్రొత్సహించాలని వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ (WWF) నివేదిక వెల్లడించింది.