Mumbai Murder: నేను చంపలేదు.. తను నా కూతురు లాంటిది
Mumbai: వయసులో 15 ఏళ్ల చిన్నది.. అనాథ అని తెలిసి మాట కలిపాడు ఓ 56 ఏళ్ల వ్యక్తి. రేషన్ షాపుకి వస్తుంటుంది (mumbai murder) అని తెలిసి ఆమె కోసం ముందుగానే అక్కడికి చేరుకునేవాడు. అలా ఏం మాయ మాటలు చెప్పాడో ఏమో ఆమె తన ప్రేమలో పడేలా చేసుకున్నాడు. నేను చూసుకుంటాను అని మాటిచ్చి తన ఫ్లాట్‌లో సహజీవనం చేయడం మొదలుపెట్టాడు. మూడేళ్లు కలిసే ఉన్నారు. ఉన్నట్టుండి ఏం జరిగిందో.. మూడు రోజుల క్రితం ఆమెను అతి దారుణంగా నరికి చంపి ముక్కలు ముక్కలుగా కోసి కొన్ని అవయవాలను కుక్కర్‌లో ఉడకబెట్టాడు. మరి కొన్ని అవయవాలను కుక్కలకు విసిరేసాడు. ఇంట్లో దుర్వాసన వస్తుండడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘోరం బయటపడింది. వెంటనే నిందితుడు మనోజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె తన ప్రేయసి కాదని కూతురిలా భావించానని చెప్పడం విస్మయం కలిగిస్తోంది.
“విద్యను నేను చంపలేదు. తనే ఆత్మహత్య చేసుకుంది. కేసు నా మీదకు వస్తుందేమోనని శవాన్ని నరికి అనుమానం రాకుండా చేద్దాం అనుకున్నాను. నాకు 2008లో హెచ్ఐవి సోకింది. ఓసారి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో చేరినప్పుడు ట్రీట్మెంట్ సమయంలో నాకు హెచ్ఐవి సోకిన బ్లడ్ ఎక్కించారు. నాకు హెచ్ఐవి పాజిటివ్ అని తెలిసి ఆమెతో ఎలాంటి లైంగిక సంబంధం పెట్టుకోలేదు. కానీ విద్య నన్ను మోసం చేయాలనుకుంది. తను పదో తరగతి పరీక్షలు రాద్దామనుకుంది. నేను తనకు మ్యాథ్స్ నేర్పించాలనుకున్నాను. జూన్ 3న నేను ఫ్లాట్‌కి వచ్చేసరికి విద్య స్పృహ తప్పి పడిపోయి కనిపించింది. ఆమె నోట్లో నుంచి నురగ వస్తోంది. పల్స్ చూస్తే అప్పటికే తను చనిపోయింది. పోలీసులకు తెలిస్తే నన్నే అనుమానిస్తారని శవాన్ని ఎవ్వరికీ కనిపించకుండా చేయాలనుకున్నా” అని చెప్పాడు. జూన్ 16 వరకు మనోజ్‌ను రిమాండ్‌లో ఉంచనున్నారు.