Viral News: తాగి 30 ఏళ్ల మర్డర్ మిస్టరీ కక్కేసాడు..!
Mumbai: మందు తాగితే నిజాలన్నీ బయటికి వచ్చేస్తాయి అంటుంటారు (viral news). కానీ ఓ వ్యక్తిని కటకటాల పాలుచేసింది. పీకలదాకా తాగి 30 ఏళ్లుగా తనలోనే దాచుకున్న మర్డర్ మిస్టరీని అందరి ముందు కక్కేసాడు ఓ వ్యక్తి. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. అది 1993 అక్టోబర్ నెల. అవినాష్ పవార్ అనే వ్యక్తి మరో ఇద్దరితో కలిసి లోనావాలాలో నివసిస్తున్న ఓ 55 ఏళ్ల వ్యక్తి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. అడ్డుకున్నందుకు యజమానిని, అతని భార్యను దారుణంగా మర్డర్ చేసారు. అవినాష్‌కి అప్పుడు 19 ఏళ్లు. మిగతా ఇద్దరిని పోలీసులు అప్పుడే అరెస్ట్ చేసారు. కానీ అవినాష్ తన తల్లిని వదిలేసి దిల్లీ పారిపోయాడు.
ఆ తర్వాత కొన్నేళ్లకు మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చేరుకున్నాడు. అక్కడ అమిత్ పవార్ అని పేరు మార్చుకుని డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు. ఆ తర్వాత అదే పేరుతో ఆధార్ కార్డుకు కూడా అప్లై చేసుకున్నాడు. చివరిగా ముంబైకి చేరుకుని అక్కడి అమ్మాయినే పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాడు. భార్యను పొలిటికల్ ఫీల్డ్‌లో దింపాడు. దాదాపు 30 ఏళ్ల తర్వాత.. ఇటీవల అవినాష్ తన ఫ్రెండ్స్‌తో కలిసి మద్యం సేవించాడు. తాగిన మత్తులో తను 19 ఏళ్ల వయసులో చేసిన మర్డర్ గురించి ఫ్రెండ్స్‌కి చెప్పేసాడు. దాంతో ఆ ఫ్రెండ్స్‌లోని ఓ వ్యక్తి ముంబై క్రైం బ్రాంచ్‌కు సమాచారం అందించాడు. దాంతో పోలీసులు అవినాష్‌ను అరెస్ట్ చేసారు.