ఇండియాలో రూ.40 ల‌క్ష‌ల జీతం స‌రిపోతుందా?

Hyderabad: ఇండియాలో బ‌త‌కాలంటే ఏడాది రూ.40 ల‌క్ష‌ల జీతం స‌రిపోతుందా అని ఓ యువ‌తి అడిగిన ప్ర‌శ్న‌కు నెటిజ‌న్లు షాక‌య్యారు (viral news). కార్పొరేట్ ప్ర‌పంచంలో ఎద‌గ‌డానికి అవ‌స‌ర‌మైన నైపుణ్యాలు కావాలి. ఆ నైపుణ్యాలు ఉన్నా కూడా కొంద‌రు జీతం విష‌యంలో ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్లు మిగిలిపోతున్నారు. అలాంటిది ఓ 23 ఏళ్ల యువ‌తి ఏడాదికి రూ.40 ల‌క్ష‌ల ప్యాకేజీ సంపాదిస్తూ.. ఈ సంపాద‌న ఇండియాలో బ‌త‌కానికి స‌రిపోతుందా అంటూ ట్వీట్ చేయ‌డం పెద్ద డిబేట్‌కు దారితీసింది. అయితే ఆ అమ్మాయికి అంత జీతం వ‌స్తోందా లేదా జ‌న‌ర‌ల్‌గా తెలుసుకుందామ‌ని ఈ ప్ర‌శ్న వేసిందో తెలీదు కానీ నెటిజ‌న్ల రిప్లైలు మాత్రం ఓ రేంజ్‌లో ఉన్నాయి.

కొంద‌రేమో 40 కాదు ఏడాది రూ.4 ల‌క్ష‌లు వ‌చ్చినా హ్యాపీగా బ‌తికేస్తాం అని ట్వీట్లు పెడుతుంటే..మ‌రికొంద‌రేమో అంత జీతం ఇచ్చే కంపెనీలో త‌మ‌ను కూడా రిఫ‌ర్ చేయాల‌ని రిక్వెస్ట్ పెడుతున్నారు. మ‌రో నెటిజన్ అయితే.. మీ నాన్న‌ను అడుగు అని ట్వీట్ చేసాడు. ఇందుకు ఆ యువ‌తి స్పందిస్తూ.. అడిగాను కానీ నాన్న గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగం వెతుక్కోమంటున్నారు అని స‌మాధానం ఇచ్చింది. ముంబై, బెంగ‌ళూరు లాంటి మెట్రో న‌గ‌రాల్లో ఏడాదికి కాకుండా నెల‌కు రూ.40 లక్ష‌లు వ‌స్తే బ‌తికేయొచ్చ‌ని స‌ల‌హాలు ఇస్తున్నారు. మ‌రి ఆ అమ్మాయికి త‌న‌కు కావాల్సిన స‌మాధానం దొరికిందో లేదో..!