Mohammed Asfan: ర‌ష్యాలో చ‌నిపోయిన హైద‌రాబాదీ..ఎలా జ‌రిగింది?

Mohammed Asfan: ఒక మోసం దేశం కానీ దేశం హైద‌రాబాద్ యువ‌కుడిని పొట్ట‌న‌బెట్టుకుంది. కొంత‌కాలంగా ర‌ష్యా, ఉక్రెయిన్ మ‌ధ్య యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ఈ యుద్ధంలో పాల్గొన్న హైద‌రాబాదీ యువ‌కుడు మ‌హ‌మ్మ‌ద్ అస్ఫాన్ దుర్మ‌ర‌ణం చెందాడు. ఈ విష‌యాన్ని ర‌ష్యా దౌత్యాధికారులు స్ప‌ష్టం చేసారు. (Mohammed asfan)

అస‌లేం జ‌రిగింది?

దుబాయ్‌కి చెందిన ఫైజ‌ల్ ఖాన్ అనే మోస‌పూరిత ఏజెంట్‌.. హైద‌రాబాద్‌కి చెందిన మ‌హ‌మ్మ‌ద్ అస్ఫాన్‌తో పాటు మ‌రో 20 మంది భార‌తీయుల‌కు ర‌ష్యాలో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తాన‌ని చెప్పి డ‌బ్బులు తీసుకుని మోసం చేసాడు. వారిని ర‌ష్యాకు త‌ర‌లించి అక్క‌డ ఉక్రెయిన్‌తో చేస్తున్న యుద్ధంలో పాల్గొనేలా చేసాడు. ఈ ఫైజ‌ల్ ఖాన్‌కు బాబా వ్లాగ్స్ పేరిట ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. 3 ల‌క్ష‌ల మంది స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉన్నారు. చాలా మంది నుంచి ఇత‌ర దేశాల్లో పనిచేసేందుకు వ‌ర్క ప‌ర్మిట్లు కావాల‌ని రిక్వెస్ట్‌లు వ‌స్తున్నాయ‌ని ఫైజ‌ల్ ఖాన్ ఆ వీడియోలో తెలియ‌జేసాడు. అంద‌రికీ ఇవే వీడియోలు చూపించి త‌న‌కు అన్నీ తెలుస‌ని న‌మ్మ‌బ‌లికేవాడు.

మ‌హ‌మ్మ‌ద్ అస్ఫాన్‌తో పాటు మ‌రో ముగ్గురు యువ‌కుల‌కు ఈ ఫైజ‌ల్ ఖాన్ దుబాయ్‌లో ప‌రిచ‌యం అయిన‌ట్లు ఆ ముగ్గురు యువ‌కుల్లో ఒక యువ‌కుడికి చెందిన తండ్రి అబ్దుల్ న‌యీమ్ వెల్ల‌డించాడు. ర‌ష్యాలో అధిక జీతం వ‌చ్చే సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాలు ఇప్పిస్తాన‌ని న‌మ్మ‌బ‌లికి వారి నుంచి రూ.3 ల‌క్ష‌ల వ‌ర‌కు తీసుకున్న‌ట్లు తెలిపాడు. అలా గ‌తేడాది డిసెంబ‌ర్‌లో మ‌హ్మద్ అస్ఫాన్‌తో పాటు ఆ ముగ్గురు యువ‌కులు ర‌ష్యా చేరుకున్నారు. ఆ త‌ర్వాత దొంగ‌చాలుగా కొన్ని పత్రాల‌పై సంత‌కాలు చేయించుకుని వారిని ర‌ష్యా సైన్యంలోకి దించారు.

వారికి బేసిక్ గ‌న్ ట్రైనింగ్ ఇప్పించి ఉక్రెయిన్‌లోని ఖార్కీవ్, డోనెట్స్‌క్‌, మ‌రియుపోల్ ప్రాంతాల్లో యుద్ధానికి పంపారు. ఫిబ్ర‌వ‌రి 21న మ‌హ్మ‌ద్ అస్ఫాన్ చ‌నిపోయిన‌ట్లు హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దిన్ ఒవైసీకి తెలిసింది. ఆయ‌నే ఈ విష‌యాన్ని కేంద్ర విదేశాంగ మంత్రికి తెలియ‌జేసి అక్క‌డ ఇరుక్కున్న యువ‌కుల‌ను ర‌ప్పించాల‌ని కోరారు. ఈ నేప‌థ్యంలో మ‌హ్మ‌ద్ అస్ఫాన్ యుద్ధంలో చ‌నిపోయిన‌ట్లు ర‌ష్యా దౌత్యాధికారులు స్ప‌ష్టం చేసారు. అత‌ని మృత‌దేహాన్ని త్వ‌ర‌లో ఇండియాకు పంప‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. అక్క‌డ ఇరుక్కున్న మ‌రికొంద‌రు భార‌తీయులు త‌మ‌ను వెంట‌నే ఇండియాకు తీసుకెళ్లాలంటూ వీడియోల‌ను రిలీజ్ చేస్తున్నారు.

తెలంగాణ‌, గుజ‌రాత్, క‌శ్మీర్, క‌ర్ణాట‌క‌, ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌కు చెందిన యువ‌కులు ర‌ష్యా సైన్యంలో ఇరుక్కుపోయారని ఒవైసీ ప్ర‌క‌టించారు. వారిని వీలైనంత త్వ‌ర‌గా ఇండియాకు తీసుకువ‌చ్చేందుకు భార‌త ప్ర‌భుత్వం అన్ని విధాలుగా ప్ర‌య‌త్నిస్తోంది. మ‌హ్మ‌ద్ అస్ఫాన్ చనిపోయిన స‌మ‌యంలో క‌శ్మీర్‌కి చెందిన యువ‌కుడి కాలికి బులెట్ త‌గిలింది. ప్ర‌స్తుతం అత‌ని ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

క‌నీసం ప‌త్రాల‌ను చ‌ద‌వ‌నివ్వ‌కుండా సంత‌కాలు పెట్టించేసుకుని యుద్ధంలో సైనికులుగా వాడుకుంటున్నార‌ని.. వ‌దిలేయ‌మ‌ని వేడుకుంటుంటే.. పాస్‌పోర్ట్ చింపేస్తామంటూ బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని భార‌తీయులు విల‌విల‌లాడుతున్నారు. గ‌తేడాది ఉక్రెయిన్‌తో జ‌రిగిన యుద్ధం వ‌ల్ల ర‌ష్యాలో దాదాపు 3 ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 820,000 నుంచి 920,000 మంది దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. దాంతో రానున్న ఏళ్ల‌లో ర‌ష్యాలో జ‌నాభాను పెంచుకోవ‌డంపైనే దృష్టిపెట్ట‌నున్న‌ట్లు ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ర‌ష్యాలో చాలా కుటుంబాల్లో ఒక్కో మ‌హిళ ఐదు నుంచి ఆరుగురు పిల్ల‌ల్ని క‌నేవార‌ని.. అమ్మ‌మ్మ‌ల కాలంలో అయితే దాదాపు 10 మందిని క‌నేవార‌ని పుతిన్ గుర్తుచేసారు. ఇప్పుడు అదే సంప్ర‌దాయాన్ని కొనసాగించాల‌ని పెద్ద కుటుంబాలు అనేది ర‌ష్యాలో ఓ సంప్ర‌దాయం కావాల‌ని ఆదేశాలు జారీ చేసారు.