సవతి తల్లి ద్వేషం.. సీరియల్ కిల్లర్‌గా మారిన వైనం
Serial Killer: పుట్టినప్పుడు అందరూ మంచివాళ్లే. వారు ఎలాంటి వాతావరణంలో ఎలాంటి మనుషుల మధ్య పెరుగుతారు అనేదానిపై పెద్దయ్యే కొద్ది వారి ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన బాలుడి పట్ల సవతి తల్లి చూపించిన ద్వేషం అతన్ని ఈరోజు మోస్ట్ వాంటెడ్ సీరియల్ కిల్లర్‌ని చేసింది. సవతి తల్లి తన పట్ల చూపించిన ద్వేషం.. తనను టార్చర్ పెట్టిన విధానం తలుచుకుని అతను ఆడవారిపై అసహ్యం పెంచుకున్నాడు. ఎంతలా అంటే.. ఆడవారు కనిపిస్తే చాలు వారిని అక్కడికక్కడే చంపేసేలా. అలా అతను 13 నెలల్లో 9 మంది ఆడవారిని దారుణంగా హత్యచేసాడు.
ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని రేయ్ బరేలీలో చోటుచేసుకుంది. ఈ సీరియల్ కిల్లర్‌ను పట్టుకునేందుకు పోలీసులు ఆపరేషన్ తలాష్ అని మొదలుపెట్టారు. 22 పోలీస్ బృందాలు, 150 ప్రదేశాల్లో తనిఖీలు, 1.5 లక్షల మొబైల్ నెంబర్ల ట్రాకింగ్, 24 గంటలూ పనిచేసేలా వార్ రూం ఏర్పాటు చేస్తే కానీ నిందితుడు దొరకలేదు. నిందితుడి ఆనవాళ్లను స్కెచ్ వేయించి ఉత్తర్‌ప్రదేశ్ మొత్తం అంటించారు. అలా నిందితుడు
కుల్దీప్ కుమార్‌ని పోలీసులు అరెస్ట్ చేసారు.
కిల్లర్ కుల్దీప్ కుమార్ పొలాల్లో ఒంటరిగా పనిచేసుకునే మహిళలనే టార్గెట్ చేసేవాడు. వారి దగ్గరికి వెళ్లి తన కోరికలు తీర్చమనే వాడు. వారు ఒప్పుకోకపోతే వారి చీర కొంగుతోనే గొంతు బిగించి చంపేసేవాడు. అంతటితో ఆగకుండా వారి చీర కొంగు, చున్నీ, బొట్టు, గాజులు ఇలా ఏది దొరికితే అది తీసుకుని తన దగ్గర పెట్టుకునేవాడు. వాటిని చూసుకుంటే సంతోషించేవాడు. కుల్దీప్ కుమార్ తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో అతని తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు. దాంతో తల్లి ప్రేమకు నోచుకోలేదు. సవతి తల్లి చిత్రహింసలు పెట్టేది. దాంతో అతనికి ఆడవారంటేనే అసహ్యం వేసింది.
మొన్న జులై 4న కుల్దీప్ ఓ మహిళను దారుణంగా హత్య చేస్తుంటే ఓ వ్యక్తి చూసాడు. వెంటనే అతను పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతను చెప్పిన ఆధారాలను బట్టి స్కెచ్ వేయించారు. అలా పోలీసులు నిన్న స్థానిక మథియా నది సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 9 హత్యలు చోటుచేసుకోగా 6 హత్యలు తానే చేసానని ఒప్పుకున్నాడు. మరో మూడు హత్యలు కూడా అతనే చేసినట్లు ఆధారాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.