Instacart: ఖాళీ ఫ్రిజ్ తెచ్చిపెట్టిన వేల కోట్ల ఐడియా
ఇప్పుడున్న స్టార్టప్స్ చూసుకుంటే.. మన నిత్య జీవితంలో ఎదుర్కొనే చిన్న చిన్న సమస్యల నుంచి పుట్టిన ఐడియాలే ఉంటాయి. అన్నీ కాకపోయినా కొన్ని స్టార్టప్స్ మాత్రం వేల కోట్ల టర్నోవర్‌తో ఏకంగా స్టాక్ మార్కెట్‌లో ట్రేడ్ అవుతున్నాయి. అలాంటి స్టార్టప్‌లలో ఒకటే ఈ ఇన్‌స్టాకార్ట్ (instacart). ఒక ఖాళీ ఫ్రిజ్ వల్ల వచ్చిన ఐడియాతోనే ఈ ఇన్‌స్టాకార్ట్ స్టార్టప్ మొదలైందని అంటున్నాడు దాని వ్యవస్థాపకుడు అపూర్వ్ మెహతా (apoorv mehta). ఇన్‌స్టాకార్ట్ అనేది అమెరికాలోనే అతిపెద్ద గ్రోసరీ డెలివరీ కంపెనీ. అసలు ఈ ఐడియా తనకు ఎలా వచ్చిందో లింక్డిన్‌లో వివరిస్తూ పెట్టిన పోస్ట్‌కి వేలల్లో లైక్స్ వస్తున్నాయ్.
అది 2012.. అపూర్వ్‌కి ఆకలేసి ఫ్రిజ్‌లో ఏమున్నాయా అని తెరిచి చూసాడు. కానీ ఏమీలేవు. బయటికి వెళ్లి తెచ్చుకుందామా అంటే వర్క్‌లో బిజీగా ఉన్నాడు. పోనీ ఆర్డర్ పెట్టుకుందామా అంటే సరుకులు డెలివరీ చేసే యాప్స్ ఏమీ లేవు. అప్పుడే అపూర్వ్‌కి ఈ ఆలోచన వచ్చింది. అరగంటలో కావాల్సిన సరుకులు ఇంటికి డెలివర్ చేసే యాప్ ఉంటే ఎలా ఉంటుంది అనుకున్నాడు. ఆలోచన వచ్చిందే మొదలు అమలు చేసేద్దామని తనకున్న కోడింగ్ నాలెడ్జ్‌తో యాప్‌కి కావాల్సిన కోడింగ్ రాసుకున్నాడు. అలా ఇన్‌స్టాకార్ట్ ఫస్ట్ వెర్షన్ యాప్‌ని రిలీజ్ చేసాడు.
కట్ చేస్తే.. ఇప్పుడు ఇన్‌స్టాకార్ట్ అమెరికాలోనే లీడింగ్ డెలివరీ యాప్. ఇది స్టాక్‌మార్కెట్‌లో $CART టికర్ నేమ్‌తో ట్రేడ్ అవుతోంది కూడా. ఇప్పుడు ఈ కంపెనీ విలువ కొన్ని బిలియన్ డాలర్లు ఉంది. ఈ ఐడియా తనదే అయినప్పటికీ తనను నమ్మి ఇన్‌వెస్ట్ చేసి యాప్ డెవలప్ అయ్యేందుకు సాయపడిన వారికి అపూర్వ్ కృతజ్ఞతలు తెలిపాడు. (instacart)
యాక్సిడెంట్‌తో వచ్చిన ఐడియా
ఇలాంటి చిన్న ఐడియాతో వచ్చిన మరో సక్సెస్‌ఫుల్ స్టార్టప్ కంపెనీ ఎంకెఫీన్ (mcaffeine). ఎంకెఫీన్ వ్యవస్థాపకుడు తరుణ్ శర్మకు జరిగిన చిన్న యాక్సిడెంట్‌లో నుంచి పుట్టికొచ్చిన ఐడియానే ఇది. ఓసారి తరుణ్ శర్మకు చిన్న యాక్సిడెంట్ జరిగిందట. ఆ సమయంలో అతని కన్ను వాచిపోయింది. దాంతో ఇంట్లో ఉన్న టీ బ్యాగ్స్‌ని ఫ్రిజ్‌లో పెట్టి వాటిని కంటిపై పెట్టుకున్నాడు. దాంతో వాపు తగ్గిపోయింది. టీ బ్యాగ్స్‌లో కెఫీన్ ఉంటుంది కాబట్టి అది చర్మానికి ఎంతో మంచి చేస్తుందని ఎన్నో రకాల చర్మ సమస్యలు కూడా దూరం చేస్తుందని ఈ ఎంకెఫీన్ అనే సంస్థను ప్రారంభించాడు. ఈ కంపెనీలో తయారుచేసే ప్రొడక్టులు అన్నీ కాఫీ పొడితో తయారు చేసేవే..!