Uttar Pradesh: ఏకంగా హెలికాప్టర్ ఎత్తుకెళ్లారు
Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లో అరుదైన షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. కార్లు, బైకులు, సైకిళ్లు ఎత్తుకెళ్లేవారిని చూసాం కానీ ఈ ఉత్తర్‌ప్రదేశ్ దొంగలు ఏకంగా హెలికాప్టర్‌నే దొంగిలించారు. మీరఠ్‌లోని పర్తాపూర్ ఎయిర్‌స్ట్రిప్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రవీంద్ర సింగ్ అనే పైలట్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రవీంద్ర సింగ్ ఎస్ఏఆర్ ఏవియేషన్ సర్వీస్ కంపెనీ తరఫున పైలట్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతను మెయింటైనెన్స్ సర్వీస్ నిమిత్తం VT-TTBB హెలికాప్టర్‌ను మీరఠ్ ఎయిర్ స్ట్రిప్‌పై ల్యాండ్ చేసాడు.
ఎయిర్‌స్ట్రిప్‌పై ఆగివున్న హెలికాప్టర్‌ని కొందరు దుండగులు పార్టులు విప్పతీస్తున్నారని మెకానిక్ రవీంద్రకు సమాచారం ఇవ్వడంతో అతను వెంటనే వారిని నిలదీసేందుకు వెళ్లాడు. రవీంద్రను చూడగానే ఆ ముఠా కత్తులతో బెదిరించారు. సైలెంట్‌గా ఉండకపోతే చంపేస్తాం అని బెదిరించారు. నిస్పహాయ స్థితిలో ఆ పైలట్ చూస్తుండిపోయాడు. హెలికాప్టర్ భాగాలన్నీ విప్పి 16 టైర్ల ట్రక్కులో ఎక్కించి ఎత్తుకెళ్లిపోయారు. రవీంద్ర సింగ్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు అసలు పట్టించుకోలేదు. దాంతో పై అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వెంటనే పోలీసులు యాక్షన్‌లోకి దిగారు.
ఈ చోరీని బట్టి చూస్తే రెండు ఏవియేషన్ కంపెనీల మధ్య గొడవ జరిగి ఉంటుందని.. ఒకరిని దెబ్బతీసేందుకు మరో కంపెనీ ఇలా దుండగులను పంపి చోరీకి పాల్పడి ఉంటుందని పోలీస్ అధికారులు తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.