Monu Manesar: ఎక్కడికి పోతావు చిన్నవాడా..!
పట్టుమని 30 ఏళ్లు కూడా లేవు. ఆవుల సంరక్షణ అంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఆరుగురు వ్యక్తుల మృతికి కారణమైన మోనూ మనేసార్ (monu manesar) మొత్తానికి పోలీసులకు చిక్కాడు. ఇటీవల హర్యానాలో (haryana violence) ఇరు వర్గాల మధ్య జరిగిన సంఘర్షణలో ఆరుగురు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘర్షణలకు కారణం ఈ మోనూనే. ఇతను చాలాకాలంగా ఆవుల సంరక్షణ విభాగంలో సభ్యుడిగా ఉన్నాడు.
అసలు ఎవరీ మోనూ మనేసార్?
భజరంగ్ దళ్ సభ్యుడిగా ఉన్న మోనూ మనేసార్.. ఫిబ్రవరిలో రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను దారుణంగా చంపి కారులో పెట్టి పరారయ్యాడు. అప్పటి నుంచి ఇతని కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఇది చాలదన్నట్లు.. ఇటీవల హర్యానాలో ఓ ఉత్సవం జరగుతున్న సమయంలో ఆల్రెడీ మర్డర్ కేసు ఉన్న వ్యక్తిని ఉత్సవంలో ఎలా పాల్గొననిస్తారు అని రచ్చ జరిగింది. ఈ రచ్చ మోనూ వల్లే మొదలైంది. అలా ఇరు వర్గాల మధ్య జరిగిన దాడిలో ఆరుగురు చనిపోయారు. అప్పటినుంచి మోనూ తప్పించుకుంటూ తిరుగుతున్నాడు. మేవాట్కి చెందిన మోహిత్ అలియాస్ మోనూ మనేసార్.. గో సంరక్షకుడిగా పనిచేస్తున్నాడు. ఆవులపై ఎవరైనా దాడులు చేస్తే వారిపై దారుణంగా దాడులు చేయిస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడుతుండేవాడు. (monu manesar)
లవ్ జిహాద్‌కి వ్యతిరేకంగా జరిగిన ప్రచార కార్యక్రమాల్లోనూ ఎక్కువగా పాల్గొంటూ ఉండేవాడు. 2019లో ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నారని తెలిసి వారిని వెంబడిస్తుంటే ఇతనిపై కాల్పులు జరిగాయి. అప్పటి నుంచి మోనూ మనేసార్ పేరు మారుమోగిపోతోంది. 2015లో హర్యానా ప్రభుత్వం తీసుకొచ్చిన గో సంరక్షణ టాస్క్ ఫోర్స్‌లో ఈ మోనూ సభ్యుడిగా ఉన్నాడు. మొన్న హర్యానా అల్లర్లలో ప్రధాన నిందితుడైన మోనూని ఈరోజు మధ్యాహ్నం పోలీసులు అరెస్ట్ చేసారు. ప్రస్తుతం ఇతను రాజస్థాన్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు.