Guruva Reddy: చిరంజీవి సినిమాలో అదో చెత్త సీన్
Guruva Reddy: మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమా గుర్తుందా? మెడికల్ మాఫియా అక్రమాలను ఎండగట్టిన సినిమా అది. ఆ సినిమా గురించి కిమ్స్ – సన్‌షైన్ హాస్పిటల్స్ CEO గురువా రెడ్డి స్పందించారు. ఠాగూర్ సినిమాలో హాస్పిటల్స్.. అందులో పనిచేసే వైద్యులు ఎలా అక్రమాలకు పాల్పడుతూ పేషంట్లను దోచుకుంటారో చూపించే సీన్‌కి ఇప్పటికీ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సీన్‌పై గురువా రెడ్డి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సినిమాలో దీనంత చెత్త సీన్ మరొకటి చూడలేదని మండిపడ్డారు.
“” చిరంజీవి నాకు మంచి మిత్రుడు. మేం కలిసి ఎన్నోసార్లు భోజనం చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఠాగూర్ సినిమాలోని ఆ ఒక్క సీన్‌లో వైద్యులంతా మోసగాళ్లే అన్నట్లుగా చూపించడం చాలా తప్పు. ఇదే విషయాన్ని నేను చిరంజీవితో అన్నాను. వైద్య రంగంలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి. నేను కూడా ఒప్పుకుంటాను. కానీ ఠాగూర్ సినిమాలో చూపించినంత ఘోరంగా మాత్రం ఎవ్వరూ ఉండరు. ఓ దర్శకుడు ఇంతకంటే చెత్త సీన్ తీయలేడేమో. ఆ ఒక్క సీన్ వల్ల వైద్యుల పరువు మొత్తం పోయింది. ఇప్పటికీ చాలా మంది పేషెంట్లకు వైద్యుల పట్ల వైద్యం పట్ల నమ్మకం లేదు. ఈ భయానికి నేను పెట్టిన పేరు ఠాగూర్ సిండ్రోమ్. ఈ భయం ప్రపంచంలోని ఏ వైద్యుడికి లేదు. కానీ భారతీయ వైద్యులు మాత్రం ఠాగూర్ సినిమా వల్ల ఈ సిండ్రోమ్‌తో బాధపడుతున్నారు. ఒక వైద్యుడు రోజంతా ఎంతో కష్టపడాల్సి వస్తుంది. కుటుంబాలను వదిలి ప్రజలకు వైద్యం అందిస్తాం. ఇప్పటికీ నా దగ్గరికి వచ్చే పేషెంట్లలో ఎవరికైనా MRI తీయించుకోండి ICUలో పెట్టాలి అని చెప్తే నమ్మరు. నేను మోసం చేస్తున్నా అనుకుంటున్నారు. దర్శకుడు వివి వినాయక్ ఒక్కరోజు మాతో ఉండి మా బాధను గమనించమనండి. అప్పుడు ఇలాంటి ఠాగూర్ సీన్ మరొకటి తీయకుండా ఉంటాడు “” అని మండిపడ్డారు.