డ్యాంలో పడిపోయిన అధికారి ఫోన్..లక్షల లీటర్ల నీరు వృధా!
Chhattisgarh: ఓ ప్రభుత్వ ఉద్యోగి ఫోన్ కోసమని 20 లక్షల లీటర్లను వృధా చేసారు (viral news). ఈ దారుణ ఘటన ఛత్తీస్గఢ్లో (chattisgarh) చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. కోయళిబెడకు చెందిన రాజేష్ విశ్వాస్ ఫుడ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. గురువారం సరదాగా కేర్ఖట్టా పరల్కోట్ డ్యాంకు వెళ్లాడు. అక్కడి డ్యాం అందాలను చూస్తుండగా తన చేతిలో ఉన్న ఫోన్ పడిపోయింది. ఆ ఫోన్ విలువ రూ.90,000. ఇది కాకపోతే అతను మరో ఫోన్ కొనుక్కునే స్థోమత ఉంది. కానీ రాజేష్ అలా చేయకుండా తనకు తన ఫోన్ కావాలని మొండిపట్టు పట్టాడు. డ్యాం నుంచి ఫోన్ వెతికి తీయించడానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడాడు.
ఆ డ్యాం లోతు 15 అడుగులు ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న 1500 ఎకరాలకు ఈ డ్యాం నుంచి నీరు వెళ్తుంది. ఇవేమీ ఆలోచించకుండా అధికారుల ద్వారా ఏకంగా 30 హార్స్ పవర్ ఉన్న పంపు ద్వారా డ్యాంలో నీటిని ఖాళీ చేయించాడు. దాంతో ఒక చిన్న ఫోన్ కోసం ఒక్క రోజులో 20 లక్షల లీటర్ల నీరు వృధాగా పోయాయి. అయితే అతని ఫోన్ మాత్రం మూడు రోజుల తర్వాత దొరికింది. ఇంతా చేస్తే ఆ ఫోన్ 3 రోజులు నీళ్లలో నానిపోవడంతో పనిచేయలేదు. కానీ డ్యాంలో నీరు మాత్రం 10 అడుగుల వరకు తగ్గిపోయాయి. ఫోన్ నీళ్లలో పడిపోతే పనిచేయదని తెలిసి కూడా అనవసరంగా నీటిని వృధా చేయించినందుకు స్థానికులు మండిపడుతున్నారు.