Flipkart: UPI సేవలు ప్రారంభించిన ఫ్లిప్ కార్ట్

Flipkart: ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కీలక ప్రకటన చేసింది. ఫ్లిప్‌కార్ట్ యూపీఐ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక మీదట ఎలాంటి థర్డ్ పార్టీ పేమెంట్స్ యాప్స్‌పై ఆధారపడాల్సిన అవసరం లేకుండా.. సొంత యాప్‌లోనే పేమెంట్స్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

వాల్‌మార్ట్ నేతృత్వంలోని ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్.. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవల్ని ప్రారంభించింది. ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంకుతో భాగస్వామ్యం కుదుర్చుకొని ఈ సేవల్లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. యాప్ ద్వారా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పేమెంట్స్ చేయొచ్చని పేర్కొంది. సూపర్ కాయిన్స్ , క్యాష్ బ్యాక్ , మిలిస్టోన్ బెనిఫిట్స్ , బ్రాండ్ వోచర్‌లు వంటి ప్రయోజనాలు ఫ్లిప్కార్ట్ యూపీఐలో అందుబాటులో ఉంటాయి. కంపెనీ గత సంవత్సరం నుండి తన యూపీఐ సర్వీసును పరీక్షిస్తోంది. ఇప్పుడు సామాన్యుల కోసం దీన్ని ప్రారంభించింది.. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని తెలుస్తుంది.

ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ కంపెనీ తన వినియోగదారులకు దాని స్వంత యూపీఐ సేవను అందించడానికి సులువుగా ఉంటుంది. దీంతో ఇక మీదట ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేసిన వారు.. పేమెంట్ చేసేందుకు థర్డ్ పార్టీ యాప్స్ అయినటువంటి గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి వాటిపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేసింది. తొలుత ఆండ్రాయిడ్‌ మొబైల్‌ వినియోగదార్లకు మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ కొత్త సేవల వల్ల మిగిలిన యాప్ లకు పెద్ద సమస్యలు రావచ్చునని తెలుస్తుంది.

‘డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్ వేగంగా మారుతున్న క్రమంలో.. కస్టమర్లకు నిరంతర యూపీఐ సేవల్ని అందించేందుకు ఫ్లిప్‌కార్ట్ యూపీఐ సేవల్ని తీసుకొచ్చాం.’ అని ఈ ఫిన్‌టెక్ అండ్ పేమెంట్స్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధీరజ్ అనెజా తెలిపారు.

ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో యూపీఐ ఐడీని క్రియేట్ చేయడం ద్వారా మర్చంట్లు, వ్యక్తులకు చెల్లింపులు జరపొచ్చని చెప్పారు అనెజా. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగదారులకు మాత్రమే ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 50 కోట్ల మందికిపైగా కస్టమర్లు, 14 లక్షల మంది విక్రేతలు ఇక మీదట ఫ్లిప్‌కార్ట్‌తో యూపీఐ సేవల్ని పొందొచ్చని వెల్లడించారు.

కొద్ది రోజుల కిందట ఫుడ్ డెలివరీ సర్వీస్ జొమాటో కూడా ఈ సేవల్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అంతకుముందు వీటిల్లో పేమెంట్ చేసేందుకు ఇతర థర్డ్ పార్టీ యాప్స్‌ను ఎంచుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఉండదు. అమెజాన్, టాటా న్యూ కూడా చాలా కాలం నుంచే వీటిని అందిస్తున్న సంగతి తెలిసిందే.

కొద్ది రోజుల కిందట ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కస్టమర్ల నుంచి డిపాజిట్లు స్వీకరించొద్దని.. ఇంకా వాలెట్లు, ఫాస్టాగ్స్ టాప్ అప్ చేయొద్దని నిషేధం విధించింది. ఈ క్రమంలోనే పేటీఎంపైనా ప్రభావం పడింది. పేటీఎం యూపీఐ తీవ్రంగా ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు జొమాటో, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు సొంతంగా యూపీఐ సేవల్లోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో.. పేటీఎం యూపీఐ ఇంకా ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.