Father: కన్నబిడ్డ కోసం చెత్తవాడిలా మారి.. ఓ తండ్రి దీనగాథ
Father: ఓ కన్నతండ్రికి ఇంతకు మించిన నరకం మరొకటి ఉండదేమో. కన్నబిడ్డను చూసేందుకు ఓ తండ్రి చెత్తవాడి వేషం ఎత్తాల్సి వచ్చింది. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
అసలు ఏం జరిగిందంటే.. న్యూఢిల్లీలోని సకేత్ ప్రాంతానికి చెందిన ఓ జంట 2020లో విడాకులు తీసుకున్నారు. అప్పటికే వీరికి ఐదేళ్ల కూతురు ఉంది. విడాకుల సమయంలో కూతురి కస్టడీని తల్లికే అప్పగించారు. తండ్రికి మాత్రం వారంలో ప్రతి శనివారం రెండు గంటల పాటు కలుసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసారు.
అయితే విడాకుల తర్వాత ఆ మహిళ తన బిడ్డను తీసుకుని కర్ణాటక వెళ్లిపోయింది. కూతురి కోసం తండ్రి కూడా కర్ణాటకకు షిఫ్ట్ అయ్యాడు. అయితే 2022 ఆగస్ట్ 20న ఆ వ్యక్తి తన కూతురిని కలుసుకోవాల్సి ఉంది. కానీ అతని మాజీ భార్య మాత్రం ఈ వారం వద్దు వచ్చే వారం రండి అని మెయిల్ పంపింది. ఎక్కడ తన బిడ్డను తన నుంచి దూరం చేస్తుందో అని భయం వేసి ఆగస్ట్ 20నే తన కూతురి వద్దకు వెళ్లాడు. కానీ ఆ మహిళ ఉంటున్న అపార్ట్మెంట్ వాచ్మాన్ అతన్ని రానివ్వలేదు.
ఆ తర్వాత బలవంతంగా కారులో లోపలికి వెళ్లగా వాచ్మెన్ అతన్ని బయటికి తరిమేసాడు. ఇక ఏం చేయాలో తెలీక అపార్ట్మెంట్లోకి వెళ్లే చెత్త బండి గురించి తెలుసుకుని ఆ బండిలో ఎక్కి చెత్తవాడిలా వేషం ధరించాడు. దాంతో వాచ్మెన్కి అనుమానం రాలేదు. అలా లోపలికి వెళ్లిన ఆ వ్యక్తి తన కూతురు ఉంటున్న ఫ్లాట్ దగ్గరికి వెళ్లాడు. ఈ విషయం అతని మాజీ భార్యకు తెలీడంతో కేసు పెట్టింది. రెండేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత అతని ప్రవర్తనలో కూతురిపై ప్రేమ మాత్రమే కనిపిస్తోందని కేసు చెల్లదని కర్ణాటక హైకోర్టు జడ్జి తీర్పునిచ్చారు.