సంచిలో కన్నబిడ్డ శవం.. తండ్రి ఆవేదన
Kolkata: డబ్బుల్లేక ఓ కన్నతండ్రి తన బిడ్డ శవాన్ని సంచిలో వేసుకుని బస్సులో ప్రయాణించాల్సి వచ్చింది. ఈ బాధకర ఘటన వెస్ట్ బెంగాల్‌లో(kolkata) చోటుచేసుకుంది. కాలియాగంజ్ ప్రాంతానికి చెందిన ఆషిమ్ అనే వ్యక్తి.. తన ఐదు నెలల బిడ్డ అనారోగ్యానికి గురికావడంతో సిలిగురి జిల్లాలోని హాస్పిటల్‌లో చేర్పించాడు. వారం రోజుల పాటు ట్రీట్మెంట్ ఇవ్వడంతో బిల్లు రూ.16000 అయింది. అయినప్పటికీ బిడ్డ ప్రాణాలు దక్కలేదు. దాంతో బిడ్డ శవాన్ని తిరిగి కాలియాగంజ్‌కు తీసుకువెళ్లేందుకు ఆంబులెన్స్ డ్రైవర్ ఏకంగా రూ.8000 అడిగాడట. అంత డబ్బులు లేక.. శవాన్ని ఓ సంచిలో వేసుకుని అషీమ్ బస్సులో ప్రయాణించాల్సి వచ్చింది. విషయం తెలీడంతో స్థానిక మీడియా వర్గాలు అషీమ్‌తో మాట్లాడారు.
“నా బిడ్డ చనిపోవడంతో ఆంబులెన్స్‌లోనే మా ఇంటికి తీసుకెళ్లాలనుకున్నా. కానీ ఆంబులెన్స్ డ్రైవర్ ఫ్రీగా తీసుకెళ్లలేమని, కేవలం పేషెంట్లకే ఫ్రీ సర్వీస్ అని చెప్పాడు. ఏం చేయాలో తెలీక సంచిలో వేసుకుని వెళ్లాను” అని వాపోయాడు. ఈ వీడియోను బీజేపీ నేత సువేందు అధికారి ట్విటర్‌లో షేర్ చేస్తూ.. ఇదేనా అడ్వాన్స్‌డ్ బెంగాల్ అని అధికార పార్టీని ప్రశ్నించాడు. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ నేత శాంతాను స్పందిస్తూ.. బిడ్డ శవంపై రాజకీయం వద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.