Fake Love: దేవుడా… ఇంత దారుణమా?
Bangladesh: పై ఫొటోలో కనిస్తున్న మహిళ గురించి తెలిస్తే ఇలాంటి ఆడవాళ్లు కూడా ఉంటారా అనుకోక మానరు (fake love). ప్రేమిస్తున్నానని చెప్పి.. దేశం కాని దేశం వచ్చి.. ఇక్కడ వ్యక్తిని పెళ్లి చేసుకుని చివరికి ఆమె ఇచ్చిన ట్విస్ట్ ఏంటో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. అసలు కథ ఏంటంటే.. ఆమె బంగ్లాదేష్‌కి చెందిన మహిళ. పేరు జూలీ. కొన్ని నెలల క్రితం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన అజయ్ అనే వ్యక్తిని ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకుంది.
ఇద్దరూ ఒకరిపై ఒకరు ఇష్టం పెంచుకున్నారు. అయితే అప్పటికే జూలీకి పెళ్లై 11 ఏళ్ల పాప కూడా ఉంది. అయినా కూడా అజయ్ కోసం ఉత్తర్‌ప్రదేశ్‌కి వచ్చేసింది. అజయ్ ఇంట్లోవారిని ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత వీసా ఎక్స్‌పైర్ అవుతోంది అని చెప్పి అజయ్‌ను తనతో పాటు బంగ్లాదేశ్‌కి తీసుకెళ్లింది జూలీ. ఆ తర్వాత అజయ్ తన తల్లి సునీతకు ఫోన్ చేసి పొరపాటున అక్రమంగా బోర్డర్ దాటి బంగ్లాదేశ్‌కు వచ్చేసానని చెప్పాడు. సునీత కంగారుపడుతూ తన ఇంట్లోవారికి విషయం చెప్పింది. వారు అజయ్‌ను తిరిగి ఎలా ఇండియాకు రప్పించాలా అని ఆలోచిస్తుండగా.. సునీత ఫోన్‌కి కొన్ని ఫొటోలు వచ్చాయి. ఆ ఫొటోలు చూడగానే సునీత షాకై బోరున ఏడ్చేసారు. ఎందుకంటే.. ఆ ఫొటోలో రక్తపు మరకలతో నిండిన అజయ్ ఉన్నాడు.
దాంతో సునీత వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించింది.. ” నా బిడ్డ జూలీని దింపడానికి వెళ్లి పొరపాటున బంగ్లాదేశ్ బోర్డర్‌లోకి వెళ్లిపోయాడు. తను నాకు ఫోన్ చేసినప్పుడు 15 రోజుల్లో వచ్చేస్తానని చెప్పాడు. ఇప్పటికి రెండు నెలలు అవుతోంది. ఆ జూలీ నా బిడ్డ రక్తపుమరకలలో ఉన్న ఫొటోలను పంపి బెదిరిస్తోంది. అజయ్‌ను చంపేస్తారేమోనని భయంగా ఉంది. దయచేసి ఎలాగైనా నా బిడ్డ నా దగ్గరికి వచ్చేలా చేయండి ” అని ఏడేస్తూ వేడుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.