ఉద్యోగం ఇచ్చిన కంపెనీకే వెన్నుపోటు
Cyber Attack: ఓ కంపెనీ ఉద్యోగం ఇస్తే ఆ కంపెనీకే వెన్నుపోటు పొడిచాడు ఓ ఉద్యోగి. అయితే.. ఇక్కడ తప్పు చేసింది ఉద్యోగి కాదు. కంపెనీనే. అసలేం జరిగిందంటే.. ఓ కంపెనీ (పేరు గోప్యంగా ఉంచాలన్నారు) అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలో కార్యకలాపాలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో పొరపాటున ఉత్తర కొరియాకు చెందిన యువకుడికి ఐటీ ఉద్యోగం కల్పించారు. నిజానికి అతను పంపిన రెస్యూమేలో.. ఎడ్యుకేషన్ డాక్యుమెంట్లలో తాను అమెరికాలో పుట్టి పెరిగి చదువుకున్నట్లు పేర్కొన్నాడు. కానీ అతని స్వస్థలం ఉత్తర కొరియా. దాంతో ఆ కంపెనీ మోసపోయి అతన్ని ఉద్యోగంలో తీసుకుంది. కనీసం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా చేయలేదు.
ఉద్యోగం కూడా వర్క్ ఫ్రం హోం కావడంతో కంపెనీకి సంబంధించిన కీలక డేటాను దొంగిలించాడు. ఉద్యోగం కూడా సరిగ్గా చేయలేకపోతుండడంతో అతని పెర్ఫామెన్స్ బాలేదని పేర్కొంటూ తీసేసింది. దాంతో అతను ఏకంగా కంపెనీనే బెదిరించాడు. మీ కంపెనీకి సంబంధించిన సమాచారం అంతా నా దగ్గర ఉంది. నేను అడిగినంత డబ్బు క్రిప్టో కరెన్సీ రూపంలో ఇవ్వకపోతే ఈ వివరాలు లీక్ చేస్తా అని బెదిరించాడు. దాంతో ఆ కంపెనీ యాజమాన్యం షాక్కు గురైంది. ఆ కంపెనీ అడిగినంత డబ్బు ఇచ్చిందో లేదో చెప్పలేదు కానీ తమ పట్ల ఇలాంటి సైబర్ నేరం జరిగిందని ఇతర కంపెనీలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంటూ ఓ నోటీస్ విడుదల చేసింది.
ఉత్తర కొరియాపై అమెరికా వంటి దేశాలు అంతర్జాతీయ సాన్క్షన్లు విధిస్తున్నాయి. దాంతో ఉత్తర కొరియా తమ ఉద్యోగులను రిమోట్ ఉద్యోగాలు చేసుకోవాలని ఆదేశించింది. కానీ రిమోట్ ఉద్యోగాల పేరుతో వారు ఇలా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.