జోక్ చేసిన డాక్ట‌ర్.. ఉద్యోగం నుంచి డిస్మిస్!

Brazil: డాక్ట‌ర్లు పేషెంట్లతో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి (doctor). ఏమాత్రం అజాగ్ర‌త్త‌గా ఉన్నా ఉద్యోగాలు పోతాయ్. బ్రెజిల్‌కి (brazil) చెందిన ఓ డాక్ట‌ర్‌కు ఇదే ప‌రిస్థితి ఎదురైంది. ఓ చిన్న పిల్లాడికి రాసిన మందుల చీటీలో ఏదో స‌ర‌దాగా ఐస్‌క్రీంలు కూడా రాయ‌డంతో అత‌ని ఉద్యోగం పోయింది. అస‌లు ఏం జ‌రిగిందంటే.. బ్రెజిల్‌కి చెందిన ప్రిసిలా త‌న కుమారుడికి గొంతు నొప్పి ఉండ‌టంతో ఓ డాక్ట‌ర్ ద‌గ్గ‌రికి తీసుకెళ్లింది. ఆ డాక్ట‌ర్ కేవ‌లం ఐదు నిమిషాలు ప‌రిశీలించి మందుల చీటీ రాసాడు. అందులో కొన్ని ట్యాబ్లెట్ల‌తో పాటు ఐస్‌క్రీంలు, వీడియో గేమ్ కూడా రాసాడ‌ట‌. దాంతో ప్ర‌సిల్లా షాకైంది. వెంట‌నే ఆ డాక్ట‌ర్ ప‌నిచేస్తున్న హాస్పిట‌ల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. దాంతో అత‌ని ఉద్యోగం పోయింది. ఈ విష‌యం గురించి ప్రిసిల్లా స్థానిక మీడియా వ‌ర్గాల‌కు వివ‌రించింది.

“నా కొడుక్కి గొంతు నొప్పిగా ఉంది. ద‌గ్గ‌ర్లోని హాస్పిట‌ల్‌కి తీసుకెళ్లాను. అక్కడి డాక్ట‌ర్ మా అబ్బాయికి క‌నీసం స‌రిగ్గా చెక‌ప్ కూడా చేయ‌లేదు. పైగా మీరు వాడి గొంతు చూసారా అని న‌న్నే అడిగారు. నేనెందుకు చూస్తాను డాక్ట‌ర్‌గా మీరు క‌దా చూడాల్సింది అన్నాను. ఆ త‌ర్వాత నా కొడుకుతో మాట్లాడుతూ ఐస్‌క్రీం ఇష్ట‌మా ఏ ఫ్లేవ‌ర్ ఇష్టం అని అడిగాడు. ఆ త‌ర్వాత మందుల చీటీ రాసిచ్చాడు. అందులో ఐదు ట్యాబ్లెట్లు రాసి వాటి కింద ఒక ఐస్‌క్రీం, వీడియో గేం అని రాసాడు. అలా ఎలా జోకులు వేస్తారు. డాక్ట‌ర్ అంటే ఎంత బాధ్య‌త‌గా ఉండాలో తెలీదా అని” వెల్ల‌డించింది.