దాడుల్లో చనిపోయిన డాక్టర్.. కన్నీరుపెట్టిస్తున్న చివరి మాటలు
Israel Gaza War: ఫోటోలో ఉన్న వ్యక్తిని చూసారా.. ఆ ముక్కుపచ్చలారని ఇద్దరూ అతని పిల్లలు. ఇతను పాలెస్తీనాకు చెందిన వైద్యుడు. గాజాకు చెందిన హమాస్ ఉగ్ర సంస్థపై ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్న నేపథ్యంలో హమామ్ అల్లో అనే ఈ వైద్యుడు గాజాలోనే ఉన్నాడు. అందరూ తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గాజా నుంచి వలసపోతుంటే ఇతను మాత్రం యుద్ధ దాడుల్లో గాయపడుతున్నవారికి చికిత్స అందిస్తూ గాజాలోనే ఉండిపోయాడు. గాజాలోని అల్ షిఫా అనే హాస్పిటల్‌లో నెఫ్రాలజిస్ట్‌గా పనిచేస్తున్న హమామ్ నిన్న జరిగిన దాడుల్లో మృతిచెందాడు.
అయితే కొన్ని రోజుల క్రితం స్థానిక మీడియా వర్గాలు ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు ఎందుకని గాజాను వదిలి వెళ్లలేదు అని అడగ్గా.. నేను వెళ్లిపోతే ఇక్కడి ప్రజలను ఎవరు కాపాడతారు? వారు వైద్యం అందక చనిపోకూడదు. నేను డాక్టర్ చదివి 14 ఏళ్లు ప్రాక్టీసింగ్ చేసింది నా పారిపోయి నా ప్రాణాలు కాపాడుకోవడానికా? కాదు కదా.. అని అన్నాడట. నిన్న జరిగిన దాడుల్లో హమామ్‌తో పాటు అతని తండ్రి, మామగారు కూడా చనిపోయారు. అతని భార్య పిల్లలు అనాథలుగా మారారు. ప్రజల ప్రాణాల కోసం ఆలోచించి తన ప్రాణాలను సైతం లెక్క చేయని మనిషిని ఆ దేవుడు ఇలా తీసుకుపోతాడని అనుకోలేదని హమామ్ కొలీగ్స్ కన్నీరుపెడుతున్నారు.