“మొత్తానికి 2024లో హత్య చేసేసా”
Doctor Murder: నిన్న ఢిల్లీలో జరిగిన వైద్యుడి హత్య సంచలనంగా మారింది. 17 ఏళ్ల కుర్రాడు తన స్నేహితుడితో కలిసి 55 ఏళ్ల వైద్యుడిని దారుణంగా చంపేసాడు. అంతటితో ఆగకుండా.. మొత్తానికి 2024లో హత్య చేసేసాను అని ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టడం వైరల్‌గా మారింది. ఢిల్లీలోని కలింది కుంజ్ ప్రాంతంలో ఉన్న నీమా హాస్పిటల్‌లో జావేద్ అక్తర్ అనే వ్యక్తి వైద్యుడిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి అదే ప్రాంతంలో నివసిస్తున్న ఇద్దరు టీనేజ్ కుర్రాళ్లు హాస్పిటల్‌కు వెళ్లారు.
వారిలో ఒకరి కాలికి గాయమైందని డ్రెస్సింగ్ కోసం వచ్చామని అన్నారు. జావేద్ వారికి డ్రెస్సింగ్ చేసి పంపించాడు. అయితే ఆ కుర్రాళ్లిద్దరూ ప్రిస్క్రిప్షన్ మర్చిపోయామంటూ మళ్లీ జావేద్ క్యాబిన్‌లోకి వెళ్లారు. వారు వెళ్లిన కొన్ని క్షణాల్లోనే తుపాకీ పేలిన శబ్దం వచ్చింది. సిబ్బంది పరుగున వెళ్లి చూడగా జావేద్ చనిపోయిన కనిపించాడు. ఆ ఇద్దరు కుర్రాళ్లు హాస్పిటల్‌లోకి రావడం జావేద్‌ను చంపడం అక్కడి నుంచి పారిపోవడం అంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. నిన్న ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసారు.
ఎందుకు చంపారు అని విచారణలో ప్రశ్నించగా.. డ్రెస్సింగ్ చేసాక తమ నుంచి అధికంగా ఫీజ్ తీసుకున్నాడని ఆ కోపంతో చంపేసామని అన్నారు. వారి మాటలు నమ్మశక్యంగా లేకపోవడంతో మరోసారి విచారణ చేయనున్నట్లు తెలిపారు. డాక్టర్‌ను చంపేసాక వారిలో ఇద్దరిలో ఓ యువకుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో తుపాకీ పట్టుకుని మొత్తానికి 2024లో మర్డర్ చేసేసాను అని స్టోరీ పెట్టడం సంచలనంగా మారింది.