సిక్ లీవ్ ఇవ్వని బాస్.. ఆఫీస్‌లో చనిపోయిన యువతి
Sick Leave: ఒంట్లో బాలేదని సిక్ లీవ్ కావాలని అడిగినా కనికరించలేదు ఓ కంపెనీ బాస్. దాంతో ఆమె ఓపిక లేకపోయినా అనారోగ్యంతో ఆఫీస్‌కి వెళ్లి పనిచేసింది. దాంతో ఆమె ఆఫీస్‌లోనే చనిపోయింది. ఈ ఘటన థాయ్‌లాండ్‌లో చోటుచేసుకుంది. బ్యాంకాక్‌లో పనిచేస్తున్న ఓ 30 ఏళ్ల యువతికి పెద్ద పేగులో ఇన్ఫెక్షన్ సోకడంతో నాలుగు రోజుల పాటు హాస్పిటల్‌లో ఉంది.
ఆ తర్వాత డిశ్చార్జి అయి ఇంటికి వచ్చినప్పటికీ విపరీతమైన నీరసం ఉండటంతో మరో వారం రోజులు సిక్ లీవ్ కావాలని.. పూర్తిగా కోలుకున్నాక వస్తానని తన బాస్‌కి చెప్పింది. ఇందుకు అతను ఒప్పుకోలేదు. ఉద్యోగం పోతుందేమో అన్న భయంతో ఆమె ఆఫీస్‌కి వెళ్లింది. అక్కడ మళ్లీ నీరసంగా నలతగా అనిపించడంతో ఇంటికెళ్తానని చెప్పింది. అప్పుడు కూడా ఆ కర్కశ బాస్ కనికరించలేదు. దాంతో ఆమె కొద్దిసేపటికే తన కుర్చీలో కుప్పకూలిపోయింది. వెంటనే తోటి ఉద్యోగులు ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. యువతి తల్లిదండ్రులు కంపెనీపై, ఆ కంపెనీ బాస్‌పై పోలీస్ కేసు పెట్టారు.