ఆర్డర్ పెట్టిన ఫుడ్ తింటూ కస్టమర్‌కు దొరికిన డెలివరీ బాయ్
Delivery Boy: కస్టమర్ ఆర్డర్ పెట్టిన ఫుడ్‌ను తింటూ ఓ డెలివరీ బాయ్ అడ్డంగా దొరికేసాడు. ఈ ఘటన నోయిడాలో చోటుచేసుకుంది. అమన్ అనే వ్యక్తి ఓలా ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ పెట్టుకున్నాడు. ఆ తర్వాత డెలివరీ బాయ్ అమన్‌కు కాల్ చేసి డెలివరీ చేసినందుకు రూ.10 అదనంగా చెల్లించాలని డిమాండ్ చేసాడు. అలాగైతేనే ఆర్డర్ డెలివరీ చేస్తానని అన్నాడు. ఇందుకు అమన్ కూడా ఒప్పుకున్నాడు. తన ఆర్డర్ కోసం దాదాపు 45 నిమిషాలుగా ఎదురుచూసాడు.
ఎంతసేపటికీ ఆర్డర్ రాకపోయేసరికి బయటికి వెళ్లి చూడగా.. తన ఇంటి ముందు ఓ డెలివరీ బాయ్ బైక్‌పై కూర్చుని అతను ఆర్డర్ పెట్టిన ఫుడ్ తింటూ కనిపించాడు. దాంతో అమన్ వెంటనే వీడియో తీసాడు. ఆ డెలివరీ బాయ్ అస్సలు భయం అనేదే లేకుండా తాను చేస్తోంది తప్పు అని కూడా లేకుండా ఏం చేసుకుంటావో చేసుకో అని పొగరుగా మాట్లాడాడు. దాంతో అమన్ ఓలా యాప్ సంస్థకు ఫిర్యాదు చేసాడు.