Wikipedia: భారత్ అంటే ఇష్టం లేకపోతే వెళ్లిపోండి.. ఢిల్లీ హైకోర్టు చురకలు
Wikipedia: ఢిల్లీ హైకోర్టు వికీపీడియాను హెచ్చరించింది. భారత్‌లో ఉండటం ఇష్టం లేకపోతే వదిలి వెళ్లిపోవచ్చని చెప్పింది. ఈ మేరకు వికీపీడియాకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. అసలేం జరిగిందంటే.. ANI సంస్థకు సంబంధించిన ఆర్టికల్‌ను ఎవరు సవరించారో వారి వివరాలను బహిర్గతం చేసేందుకు వికీపీడియా నిరాకరించింది. దాంతో ANI హైకోర్టును ఆదేశించింది. వికీపీడియాలో ANIని భారత ప్రభుత్వానికి చెందిన ప్రాపగాండా వెబ్‌సైట్ అని రాసారట. దాంతో ఆ సంస్థ వికీపీడియాపై పరువు నష్టం దావా వేసింది.
అలా రాసిన వారి వివరాలు వికీపీడియా ANI సంస్థకు ఇవ్వాల్సిందే అని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ వివరాలు ఇవ్వలేదు. దాంతో వికీపీడియాకు హైకోర్టు చీవాట్లు పెట్టింది. కోర్టు చెప్పిన తర్వాత కూడా ఎందుకు వివరాలు ఇవ్వలేదు అని అడగ్గా.. అవి భారత్‌కు సంబంధించిన వివరాలు కావని.. ANI సంస్థ అందుకు కావాల్సిన పత్రాలు కూడా తమకు సమర్పించలేదని బుకాయించింది. దాంతో న్యాయమూర్తి చావ్లా వికీపీడియాపై మండిపడ్డారు. భారత న్యాయవ్యవస్థ చెప్పినట్లు నడుచుకోకపోతే ఇక్కడ సంస్థను బంద్ చేసి హాయిగా భారత్‌ను వదిలి వెళ్లిపోవచ్చని ఆగ్రహం వ్యక్తం చేసారు.
తమ సంస్థ పట్ల తప్పుడు కథనాలను ప్రచురించేలా చేసిన వికీపీడియాపై ANI సంస్థ రూ.2 కోట్ల దావా వేసింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ అక్టోబర్‌కు వాయిదా పడింది.