Bangladesh: చోరీకి గురైన మోదీ ఇచ్చిన కిరీటం
Bangladesh: బంగ్లాదేశ్‌లోని సట్కీరా ప్రాంతంలో ఉన్న జశోరేశ్వరి ఆలయంలోని అమ్మవారికి భారత ప్రధాని నరేంద్ర మోదీ చేయించిన కిరీటం చోరీకి గురైంది. నిన్న ఆలయంలోని పూజారి పూజలు నిర్వహించి ఆలయం మూసేసాక సాయంత్రానికే ఆ కిరీటం కనిపించకుండాపోయింది. నిన్న సాయంత్రం వర్కర్లు ఆలయాన్ని శుద్ధి చేస్తున్న సమయంలో అమ్మవారి కిరీటం కనిపించకుండాపోయినట్లు గుర్తించారు. వెంటనే ఆలయ అధికారులకు ఈ విషయాన్ని తెలియజేసారు. 2021లో మోదీ బంగ్లాదేశ్‌కి వెళ్లినప్పుడు ఈ కిరీటాన్ని అమ్మవారికి పెట్టారు.
వెండితో తయారు చేయించి బంగారు పూత వేసినట్లు ఆలయాన్ని ఎప్పటి నుంచో చూసుకుంటున్న జ్యోతి చటోపాధ్యాయ్ అనే మహిళ వెల్లడించారు. చటోపాధ్యాయ్ కుటుంబీకులు తరతరాలుగా ఈ జశోరేశ్వరి ఆలయ బాధ్యతలను చూసుకుంటున్నారు. 51 అమ్మవారి శక్తి పీఠాల్లో ఈ జశోరేశ్వరి ఆలయం ఒకటని చెప్తుంటారు. 12వ శతాబ్దంలో అనారీ అనే బ్రాహ్మణుడు ఈ ఆలయాన్ని నిర్మించాడట. దాదాపు 100 ద్వారాలతో ఈ ఆలయాన్ని నిర్మించారు. తర్వాత 13వ శతాబ్దంలో లక్ష్మణ్ సేన్ అనే వ్యక్తి మరింత బాగుచేయించారు. 16వ శతాబ్దంలో రాజా ప్రతాప్ ఆదిత్య ఈ ఆలయానికి ఓ రూపును తీసుకొచ్చారు. మోదీ బంగ్లాదేశ్‌కి వెళ్లినప్పుడు ఈ ఆలయం కోసం ఓ మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్‌ను కట్టిస్తానని మాటిచ్చారు.