Euthanasia: చావులోనూ తోడుగా.. కారుణ్య మరణం పొందిన జంట
Euthanasia: చిన్ననాటి స్నేహతుడు.. పెద్దయ్యాక వారి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకున్నారు. 50 ఏళ్ల వైవాహిక జీవితాన్ని సంతృప్తిగా గడిపారు. ఇప్పుడు కలిసే ఈ లోకాన్ని వీడారు. నెదర్లాండ్స్‌కి చెందిన జాన్ ఫేబర్, ఎల్స్ వ్యాన్ దంపతుల కథ ఇది. వీరిద్దరూ కారుణ్య మరణం పద్ధతి ద్వారా మొన్న జులై 4న కలిసే తనువు చాలించారు. నెదర్లాండ్స్‌లో కారుణ్య మరణానికి అనుమతి ఉంది.
ఈ నేపథ్యంలో ఆ దంపతులు ఇద్దరూ కలిసే చనిపోవాలని నిర్ణయించుకున్నారు. జాన్ ఫేబర్ స్పోర్ట్స్ కోచ్‌గా వ్యవహరించేవాడు. ఇతనికి తీవ్రమైన నడుం నొప్పి ఉండటంతో సర్జరీ జరిగింది. వయసు రిత్యా ఆ నొప్పి తగ్గలేదు. ఈ నేపథ్యంలోఅతని భార్య ఎల్స్ వ్యాన్‌కు డిమెన్షియా వచ్చింది. ఆ డిమెన్షియా కారణంగానే వారిద్దరూ కారుణ్య మరణం పొందాలనుకున్నారు. ఈ విషయాన్ని తమ కొడుక్కి చెప్పగా అతను కూడా ఒప్పుకున్నాడు.
అలా వీరిద్దరూ కలిసి వైద్యులను కలిసారు. వారం రోజుల్లోనే కారుణ్య మరణానికి అనుమతి దొరికింది. ఈ నేపథ్యంలో తమ కుటుంబంతో కలిసి వారం రోజుల పాటు సమయాన్ని గడిపారు. ఇక కారుణ్య మరణానికి ముందు రెండు గంటల పాటు ఆ దంపతులు ఇద్దరూ కబుర్లు చెప్పుకున్నారు. ఆ తర్వాత వైద్యులు ప్రొసీజర్ మొదలుపెట్టగా కొన్ని నిమిషాల్లోనే వారిద్దరూ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని చనిపోయారు.