Chandrayaan 3 టెక్నీషియన్.. ఇడ్లీలు అమ్ముకుంటున్నాడు
భారతదేశ చరిత్రాత్మక చంద్రయాన్ 3 (chandrayaan 3) మిషన్‌లో టెక్నీషియన్‌గా సాయపడిన ఓ వ్యక్తి ఇప్పుడు రోడ్లపై బతుకు తెరువు కోసం ఇడ్లీలు అమ్ముకోవడం చర్చనీయాంశంగా మారింది. దీపక్ కుమార్ ఉప్రారియా అనే వ్యక్తి HEC (హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్)లో టెక్నీషియన్‌గా పనిచేసేవాడు. ఇతను ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 3 మిషన్‌కు కూడా టెక్నీషియన్‌గా తన సేవలు అందించాడు. HEC ఇప్పటివరకు తన చేత పని చేయించుకుని 18 నెలలుగా జీతాలు ఇవ్వలేదని వాపోయారు. దాంతో జార్ఖండ్‌లోని రాంచీ రోడ్లపై ఇడ్లీ స్టాల్ పెట్టుకున్నానని ఆవేదన వ్యక్తం చేసారు. HECకి చెందిన దాదాపు 2500 మంది ఉద్యోగులకు కూడా జీతాలు రాలేదని తెలిపారు. వారంతా కూడా బతుకు తెరువు కోసం తనలాగే ఇలా వేరే పనులు చూసుకుంటున్నారని పేర్కొన్నారు.
“” కొన్ని నెలల పాటు క్రిడిట్ కార్డు నుంచి రూ.2 లక్షలు లోన్ తీసుకుని కుటుంబాన్ని పోషించుకున్నాను. కానీ అది తిరిగి చెల్లించలేకపోవడంతో నన్ను డీఫాల్టర్ అని ముద్రించారు. ఆ తర్వాత నా బంధువులను కొంత డబ్బు సాయం అడిగాను. ఇప్పటివరకు నేను రూ.4 లక్షల వరకు అప్పు చేసాను. నేను తీసుకున్న అప్పు చెల్లించలేకపోవడంతో ఎవ్వరూ అప్పులు కూడా ఇవ్వడంలేదు. దాంతో కొన్ని రోజుల పాటు నా భార్య నగలు తాకట్టు పెట్టి ఇల్లు నెట్టుకొచ్చాను. నా భార్య ఇడ్లీలు చాలా బాగా చేస్తుంది. అలా రోజుకు రూ.400 వరకు సంపాదించగలుగుతున్నాను. 2021లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఈ ప్రభుత్వ ఉద్యోగం కోసం మానేసాను. నాకు నెలకు రూ.8000 వరకు వస్తుంది. 18 నెలలుగా ఆ జీతం కూడా లేదు. నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ల స్కూల్ ఫీజులు కూడా కట్టలేకపోతున్నాను. స్కూల్లో HECలో ఎవరెవరి తల్లిదండ్రులు పనిచేస్తున్నారు అని అడుగుతున్నారట. దాంతో నా పిల్లలు ఇంటికి వచ్చి ఏడుస్తున్నారు. నేను వారి బాధ భరించలేకపోతున్నాను “” అంటూ ఆవేదన వ్యక్తం చేసారు.